కన్నూర్ మాజీ ADM నవీన్‌బాబు చితికి నిప్పుపెట్టిన కూతుర్లు..

తనపై తీవ్ర ఆరోపణ చేశారన్న కారణంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కన్నూర్ మాజీ ADM నవీన్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కూతుర్లు చితికి నిప్పుపెట్టారు.

Update: 2024-10-17 12:54 GMT

తనపై తీవ్ర ఆరోపణ చేశారన్న కారణంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కన్నూర్ మాజీ ADM నవీన్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కూతుర్లు చితికి నిప్పుపెట్టారు. రాష్ట్ర మంత్రులు కె. రాజన్, వీణా జార్జ్‌ సహా వందలాది మంది సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. నవీన్ బాబు భౌతికకాయాన్ని కేరళలోని పతనంతిట్ట జిల్లా కలెక్టరేట్‌లో ప్రజల చివరి చూపు కోసం ఉంచారు. అక్కడ భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. మృతదేహాన్ని కేరళలోని మలయాళపుళలోని తన ఇంటికి తీసుకువచ్చినప్పుడు బాబు కుమార్తెలు, భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.

లంచం ఆరోపణలతో ఆత్మహత్య..

నవీన్ బాబు బదిలీ వీడ్కోలు కార్యక్రమంలో కన్నూర్ జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ పీపీ దివ్య ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. పెట్రోల్ బంకు పెట్టుకోడానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇచ్చేందుకు నవీన్ బాబు రూ.లక్ష లంచం తీసుకున్నాడని అందరి ముందు దివ్య ఆరోపించారు. దీంతో కార్యక్రమం ముగిసిన తర్వాత తన క్వార్టర్స్‌కు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటు పోలీసులు దివ్యపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కేసు నమోదు చేశారు.

ఆరోపణలను నేను నమ్మను.

పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు నవీన్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. పతనంతిట్ట జిల్లా మాజీ కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ చెమర్చిన కళ్లతో ఇలా అన్నారు. "మేము ఒక కుటుంబంలా కలిసి పనిచేశాం. అతనిపై వచ్చిన ఆరోపణలను నేను నమ్మలేను. అతను నిస్వార్థంగా పనిచేశాడు. కాసర్‌గోడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్ వచ్చిందని చెప్పడానికి నా దగ్గరకు వచ్చి చాలా సంతోషించాడు. నాతో ఫోటో కూడా దిగి వెళ్లిపోయాడు. ఆయనను ప్రత్యక్షంగా చూడడం అదే ఆఖరుసారి. నవీన్ బాబు మృతి నిజంగా దురదృష్టకరం. నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను.’’ అన్నారు.

పతనంతిట్ట మాజీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి పీబీ నూహ్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్వేగభరితమైన ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. ప్రజలతో కలుపుగోలుగా మాట్లాడుతూ సమర్థవంతంగా పని చేసిన వ్యక్తి నవీన్ బాబు అని కొనియాడారు. 2018 వరదల సమయంలో వచ్చిన సంక్షోభాలు, శబరిమలలోకి మహిళల ప్రవేశం చుట్టూ ఉన్న వివాదాలు, చివరకు కోవిడ్ -19 మహమ్మారిని పారద్రోలడంలో బాబు వంటి అధికారులు చేసిన కృషి వల్ల సాధ్యమయ్యిందన్నారు.

"ఎప్పుడూ నవ్వుతూ, ఏ విషయంలోనూ ఫిర్యాదు చేయని, అందరితోనూ తేలిగ్గా కలిసిపోయే వ్యక్తికి ఇలా వీడ్కోలు పలకడం బాధగా ఉంది.’’ అన్నారు నూహ్.

అవినీతి అధికారిగా చిత్రీకరించడం వెనక సీఎం రాజకీయ హస్తం..

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె. రాజన్‌, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ కలెక్టరేట్‌లో బాబుకు నివాళులర్పించారు. కలెక్టరేట్‌ నుంచి ఆయన భౌతికకాయం ఇంటికి చేరుకోగానే ఆయన భార్య, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఆయన పార్థివదేహం పక్కనే కూర్చొని విలపించారు. కాగా బాబును అవినీతి అధికారిగా చిత్రీకరించేందుకు సీపీఎం, వామపక్ష ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని, దీని వెనుక ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రాజకీయ కార్యదర్శి పి.శశి హస్తం ఉందని ఎమ్మెల్యే పీవీ అన్వర్‌ ఆరోపించారు.

Tags:    

Similar News