'పార్టీ ఆదేశాల ప్రకారమే నేను, సీఎం పనిచేస్తాం'

అధికార మార్పిడిపై మరోసారి స్పష్టత నిచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Shivakumar);

Update: 2025-01-11 15:36 GMT

కర్ణాటక(Karnataka)లో గత కొంతకాలంగా అధికార మార్పిడి గురించి జనం చర్చించుకుంటున్నారు. ముడా(Muda) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ఇరుక్కోవడంతో అధిష్టానం ఆయనను తప్పిస్తుందన్న వార్తలొచ్చాయి. ఇక ఆయన కుర్చీలో డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌ను కూర్చోబెడతారన్న ప్రచారం కూడా ఉంది. అయితే దీనిపై పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు డీకే అభిమానుల నుంచి మాత్రం ఒత్తిడి పెరిగిపోతుంది. తమ నాయకుడిని సీఎంగా చూడాలనుకుంటున్నామని బహిరంగంగానే చెబుతున్నారు. ఇదంత సులభంగా జరిగే పని కాదు. ఈ విషయం డీకేకు కూడా బాగా తెలుసు. అందుకే ఆయన ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. తన పని తాను చేసుకుపోతున్నానని, పార్టీ అధిష్ఠానం సూచనల సీఎం, నేను నడుచుకుంటామని చెబుతూ వెళ్తున్నారు.

ఆందోళన అక్కర్లేదు..

"ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు; నాయకత్వంలో మార్పులేమీ ఉండవు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. వారి శ్రేయస్సు కోసం ఐదేళ్ల పాటు పనిచేసే అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు, నేను పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తాం," అని శివకుమార్ విలేఖరుల సమావేశంలో కుండ బద్దలు కొట్టారు.

మిమ్మల్ని సీఎంగా చూడాలని మీ అభిమానులు కోరుకుంటున్నారుగా అని అడిగిన ప్రశ్నకు.."నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. నేను ఎవరి మద్దతు కోరుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమి చెబితే అది నేను చేస్తాను. నా కోసం ఎవరూ నినాదాలు చేయవద్దు. మద్దతు ఇవ్వవద్దు. నా విధులు నేను నిర్వర్తిస్తాను. ఫలితం దేవుడికి వలేస్తా," అని అన్నారు.

ఇదిలా ఉండగా శివకుమార్ మంత్రి మండలి సహచరుడు, సిద్ధరామయ్యకు చాలా దగ్గరి వ్యక్తి కేఎన్ రాజన్న శుక్రవారం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శివకుమార్ తన దృష్టిని వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయవంతంగా నడిపించడంపై పెట్టి సీఎం అయ్యేందుకు ప్రయత్నించాలని, వచ్చే రెండున్నరేళ్ల కాలంలో వచ్చే ముఖ్యమంత్రి పదవిపై కాదని సూచించారు.

సిద్ధరామయ్య ఇటీవల కొంతమంది దళితులు, గిరిజన మంత్రులకు ఆతిథ్యమిచ్చిన తరువాత..కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. ఈ మార్చ్ తర్వాత "రొటేషనల్ చీఫ్ మినిస్టర్" లేదా "పవర్-షేరింగ్" ఫార్ములా అమలు చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

లోపాయికారి ఒప్పందం?

మే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర పోటీ జరిగింది. చివరకు కాంగ్రెస్, శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించేందుకు ఒప్పించింది. ఆ సమయంలో రొటేషన్ పద్ధతిలో సీఎం సీట్ షేరింగ్ నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. వొక్కలిగ కులానికి చెందిన శివకుమార్ సందర్భం దొరికినప్పుడల్లా తాను ముఖ్యమంత్రి కావాలన్న కోరికను బలంగానే వ్యక్తపరుస్తూ వస్తున్నారు.

వాయిదా పడ్డ సమావేశం..

ఇటు గృహ శాఖా మంత్రి జీ పరమేశ్వర నేతృత్వంలో బుధవారం సాయంత్రం నిర్వహించాల్సిన ఎస్‌సీ/ఎస్టీ కమిషన్ నాయకులు, మంత్రులు, శాసన సభ్యుల సమావేశం, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా సూచనల మేరకు వాయిదా పడింది. శివకుమార్ ఇటీవల న్యూఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్‌ను కలిసి పార్టీ పరిణామాలను చర్చించిన తర్వాత ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వర్గాల సమాచారం. కాంగ్రెస్‌లోని కొంతమంది నాయకులు, ఈ సమావేశం ద్వారా దళిత లేదా AHINDA (అల్పసంఖ్యాకులు, వెనుకబడిన తరగతులు, మరియు దళితుల కోసం రూపొందించిన కన్నడ సంక్షిప్త పదం) నాయకత్వం కోసం చేస్తున్న డిమాండ్ తిరిగి వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. 

Tags:    

Similar News