కర్ణాటకలో ప్రభుత్వ కాంట్రాక్టులో ముస్లింలకు 4 శాతం కోటా

నిరసనకు సిద్ధమవుతున్న బీజేపీ;

Update: 2025-03-16 11:27 GMT

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కర్ణాటక(Karnataka)లోని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కర్ణాటక బీజేపీ(BJP) అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర(B Y Vijayendra) తెలిపారు. కాంగ్రెస్(Congress)ప్రభుత్వ నిర్ణయంపై శాసనసభలోనూ, బయటా నిరసన చేపడతామని అన్నారు.

"ఈ ప్రభుత్వం కేవలం పేపర్ పులిగా తయారైంది. రాష్ట్రాభివృద్ధి ఎలాంటి చర్యలు తీసుకోకుండా..కేవలం మైనారిటీలకు మేలు చేయడానికే పరిమితమైంది," అని విమర్శించారు.

"ముఖ్యమంత్రి (మార్చి 7న) ప్రవేశపెట్టిన 16వ బడ్జెట్‌లో ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారు. శుక్రవారం కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య. రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ నిర్ణయం మతాల మధ్య చీలికలు సృష్టించడానికి, సమాజంలో విభజన తెచ్చేందుకు చేసిన కుట్ర. బీజేపీ ఈ మత రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ ఈ ప్రజావ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా శాసనసభలోనూ, బయటా పోరాడుతుంది," అని విలేఖరుల సమావేశంలో అన్నారు విజయేంద్ర.

కేబినెట్ ఆమోదం మేరకు రూ. 2 కోట్ల వరకు విలువ గల సివిల్ వర్క్స్ ఒప్పందాలు, రూ. 1 కోట్ల వరకు వస్తువులు/సేవల ఒప్పందాల్లో 4 శాతం ముస్లింలకు కేటాయించారు.

ప్రస్తుతం కర్ణాటకలో ఎస్సీ/ఎస్టీలకు 24 శాతం, వర్గం-1కు చెందిన ఓబీసీలకు 4 శాతం, వర్గం-2Aకి 15 శాతం రిజర్వేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ముస్లింలను వర్గం-2B కింద చేర్చి 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్లు వచ్చాయి.

"వక్ఫ్ బోర్డు ద్వారా భూజిహాద్, దేశద్రోహ జిహాద్ - 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు అసెంబ్లీలో వినిపించినా కాంగ్రెస్ మంత్రులు మద్దతు ఇస్తున్నారు. ఆర్థిక జిహాద్ - వక్ఫ్ బోర్డుకు అధిక నిధులు కేటాయిస్తుండగా, అదే సమయంలో ఎస్సీ/ఎస్టీల నిధులను దారి మళ్లిస్తున్నారు. ఇది ముస్లిం ప్రాధాన్యతను పెంచే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ విధానం రాజ్యాంగ విరుద్ధమైనది. బ్రిటిష్ పాలకుల్లా విభజించి పాలించే విధానాన్ని అనుసరిస్తూ..మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు,’’ అని విజయేంద్ర ఎక్స్‌లో రాసుకొచ్చారు.

"ప్రస్తుత ప్రభుత్వం ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్ రాజసభ మాదిరిగా మారిపోయింది. హిందువులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే ఆమోదం లభిస్తోంది." అని పేర్కొన్నారు. 

Tags:    

Similar News