ధర్మస్థలకు ర్యాలీగా బయల్దేరిన బీజేపీ నాయకులు

తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే కానీ మంజునాథుడిపై దుష్ప్ర ప్రచారం ఏంటనీ మండిపడుతున్న కమలదళం;

Update: 2025-08-16 12:54 GMT
ర్యాలీ ప్రారంభిస్తున్న బీజేపీ

పవిత్ర పట్టణం ధర్మస్థల గురించి తప్పుడు సమాచారం, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ బీజేపీ నాయకులు ‘ధర్మస్థల చలో’ ర్యాలీని ప్రారంభించారు. బెంగళూర్ లోని యలహంకకు చెందిన బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఆరంభమైంది.

ర్యాలీలో 400 వాహనాలు..
బెంగళూర్ లోని నేలమంగళ టోల్ గేట్ దగ్గర ఉదయం 6.30 గంటలకు ర్యాలీ ప్రారంభం అయింది. యలహంక నియోజకవర్గం నుంచి వందలాది మంది భక్తులు, బీజేపీ కార్యకర్తలు 400 వాహనాల్లో ధర్మస్థల వైపు ప్రయాణించారు.
ధర్మస్థల, దాని పవిత్ర సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపు ప్రచారం వ్యతిరేకించడమే ఈ ర్యాలీ ఉద్దేశ్యం అని బీజేపీ నాయకులు తెలిపారు. మంజునాథ స్వామి కొలువైన ఈ ప్రాంతంలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు తాను సామూహిక ఖననాలు చేసినట్లు, అందులో చాలామంది మహిళలు ఉన్నారని వారిపై అత్యాచారం జరిగిందని చెప్పారు.
ఆయన మాటతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ అతని మాటలతో దాదాపు 11 చోట్ల తవ్వకాలు ప్రారంభించింది. అయితే ఇందులో కేవలం 6, 11 వ ప్రదేశంలో మాత్రమే మానవ అవశేషాలు లభించాయి.
మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ అవశేషాలు పురుషులకు సంబంధించినవని తేలింది. వీటిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మంజునాథుడి ప్రత్యేక దర్శనం..
ప్రయాణం మతపరమైన ఆచారాలు, వేడుకలతో ప్రారంభమైంది. సాయంత్రం ధర్మస్థల చేరుకున్న తరువాత పాల్గొనేవారు మంజునాథ స్వామి ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు.
‘‘తప్పు చేసిన వారిని శిక్ష విధించాలని’’ డిమాండ్ చేస్తూ, ఆ స్థలంలో సామూహిక ప్రతిజ్ఙ చేయనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ర్యాలీలో విశ్వనాథ్ తో పాటు మిల్క్ సెల్ రాష్ట్ర సమన్వయ కర్త బేలూర్ రాఘవేంద్ర శెట్టి, ఇతర సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు.
సీనియర్ నాయకులు హాజరు..
ఈ ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం ఉదయం మంజునాథ స్వామి ప్రత్యేక దర్శనం కోసం ధర్మస్థలాన్ని సందర్శించనున్నారు.
ఆలయ పట్టణంపై జరుగుతున్న దుష్ప్రచారానికి నిరసనగా ధర్మస్థలాన్ని సందర్శించాలనే తన ఉద్దేశ్యాన్ని విశ్వనాథ్ విలేకరులతో అన్నారు. సాయంత్రం మంజునాథ స్వామి దర్శనం తరువాత దైవిక న్యాయం కోరుతూ.. తప్పు చేసిన వారికి శిక్ష విధించమని ప్రార్థిస్తామని తన ప్రతిజ్ఙ చేస్తామని ఆయన చెప్పారు.


Tags:    

Similar News