కరూర్ బాధితులకు వీడియో కాల్ చేసిన నటుడు విజయ్
ముగ్గురు బాధిత కుటుంబ సభ్యులను సంతాపం, కోర్టుల అనుమతి తీసుకుని ప్రత్యక్షంగా వస్తానని హమీ
By : Praveen Chepyala
Update: 2025-10-08 07:59 GMT
తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా సంప్రదించడం ప్రారంభించారు. వారికి ఎల్లప్పుడు తను అండగా ఉంటానని హమీ ఇచ్చారు.
బాధిత కుటుంబాలను స్వయంగా సందర్శించకపోవడం పై కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విజయ్, సోమవారం సాయంత్రం నుంచి వీడియో కాల్స్ చేశారని బాధిత కుటుంబాలలో ఒకరు తెలిపారు.
‘‘అతడు(విజయ్) నా అల్లుడికి ఫోన్ చేసి తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇది జరగకుండా ఉండాల్సిందని అన్నారు. అలాగే కుటుంబానికి తన మద్దతును హమీ ఇచ్చారు’’ అని ఆయన కరూర్ లో విలేకరులతో అన్నారు.
ఓదార్చిన విజయ్..
మరో బాధిత కుటుంబంలోని మహిళ సభ్యురాలికి ఫోన్ చేసిన విజయ్.. ఆమెను ఓదార్చాడు. ‘‘నేను నీ కొడుకులాంటి వాడిని’’ అని అన్నారు. విజయ్ కరూర్ ను సందర్శిస్తారా? లేదా అని తమకు పూర్తిగా తెలియదని టీవీకేలోని వర్గాలు తెలిపాయి. ‘‘కానీ బాధిత కుటుంబాలను మాత్రం సంప్రదించాలని మాత్రం ఆయన పార్టీ సభ్యులను కోరారు’’ అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
వీడియో కాల్స్ కు సంబంధించి టీవీకే ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ సోమవారం నుంచి మాత్రం విజయ్ మూడు కుటుంబాలకు వీడియో కాల్స్ ద్వారా పరామర్శించినట్లు ధృవీకరించాయి.
బాధిత కుటుంబ సభ్యులు..
సెప్టెంబర్ 27న వేలుసామిపురంలో విజయ్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో 41 మంది మరణించారు. ఈ విషాదంలో తన సోదరుడు మరణించాడని, అయితే దీనికి తను విజయ్ ను నిందించాలని అనుకోవడం లేదని బాధిత యువతి తెలిపింది.
‘‘నా సోదరుడు విజయ్ ను చూడటానికి వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. పెరుగుతున్న జనసమూహాన్ని నియంత్రించడానికి అధికారులు మరింతమందిని మోహరించి ఉంటే బాగుండేది’’ అన్ని ఆమె కరూర్ లో మీడియాతో అన్నారు.
‘‘అతను(విజయ్) నన్ను ఓదార్చాడు. అతను నాకు సోదరుడులాంటి వాడని చెప్పాడు. కోర్టు కేసుల కారణంగా తాను రాలేనని, అధికారుల అనుమతి పొందిన తరువాత మమ్మల్ని సందర్శిస్తారనని విజయ్ చెప్పాడు’’ అని ఆమె వివరించింది.
ఆమె తల్లి సుమతి మాట్లాడుతూ.. విజయ్ తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశాడని, ఈ మరణాన్ని కోలుకోలేని నష్టంగా అభివర్ణించాడని, తన సంతాపాన్ని తెలియజేయడానికి తాను స్వయంగా వస్తానని ఆమెకు చెప్పాడని అన్నారు.
టీవీకే నుంచి ఐదుగురు సభ్యుల బృందం మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి వారిని విజయ్ తో అనుసంధానించింది. ప్రతికాల్ కొన్ని నిమిషాల పాటు కొనసాగింది.
విజయ్ దోషి: డీఎంకే..
బాధిత కుటుంబాలను చేరుకోవడానికి నటుడు చేస్తున్న ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. డీఎంకే ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జలవనరుల మంత్రి దురైమురుగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ విషాద మరణాలకు విజయ్ దోషి కాకపోతే అతను స్వయంగా వెళ్లి మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయాల్సింది. కానీ అతను బయటకు రావడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే అతని స్వంత హృదయం తనను చేసింది అంగీకరించడం లేదు’’ అని విమర్శించారు.