‘‘తమిళనాడు ఎవరి మీద పోరాటం చేస్తోంది’’
డీఎంకే నినాదాలను ప్రశ్నించిన గవర్నర్ ఆర్ ఎన్ రవి
By : Praveen Chepyala
Update: 2025-10-06 09:57 GMT
మహాలింగం పొన్నుస్వామి
నీట్, హిందీ విధింపు, డీలిమిటేషన్, వన్ నేషనల్ వన్ ఎలక్షన్, జీఎస్టీ నిధుల కేటాయింపు వంటి వివాదాల తరువాత తమిళనాడు- కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన పంపిన యూనివర్శిటీల బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వివాదానికి ఆజ్యం పోస్తోంది.
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, సీఎం స్టాలిన్ మధ్య అనేక సార్లు మాటల యుద్ధం జరిగింది. తాజాగా అధికార పార్టీ నినాదామైన తమిళనాడు పోరాడుమ్( తమిళనాడు పోరాటం) పై గవర్నర్ బహిరంగంగా విమర్శలు గుప్పించిన తరువాత సీఎం స్టాలిన్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
కలైంగర్ విశ్వవిద్యాలయ బిల్లును ఆమోదించడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. సుప్రీంకోర్టు ఇప్పటికే అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్, రాష్ట్రపతి కచ్చితంగా మూడు నెలలోపు ఆమోదించాలని తీర్పు చెప్పింది. దీనిపై రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే.
‘తమిళనాడు పోరాటం’ నినాదంపై గవర్నర్ అభ్యంతరం..
తమిళనాడు కవి వల్లలార్ 202వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆర్ ఎన్ రవి మాట్లాడారు. డీఎంకే గోడలపై రాస్తున్న తమిళనాడు పోరాటం లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు.
‘‘నేను తమిళనాడు అంతటా ప్రయాణించినప్పుడూ గోడలపై తమిళనాడు పోరాడుతోంది అనే నినాదం కనిపిస్తోంది. కానీ అది ఎవరితో పోరాడుతోంది? తమిళనాడుకు వ్యతిరేకంగా ఎవరూ ఏమి చేయట్లేదు కదా? మనమంతా సోదర సోదరీమణులం’’ అని ఆయన అన్నారు. ‘‘ఇక్కడ ఎవరూ ఎవరితో పోరాటం చేయనవసరం లేదు, మనమందరం కలిసి ముందుకు సాగాలి’’ అని ఆయన ఘర్షణకు బదులుగా ఐక్యతగా ఉండాలని చెప్పారు.
సామాజిక విభజనలు, పేదరికం, వివక్షతను ఖండించడంలో వల్లలార్ బోధనలు ఉపయోగపడ్డాయని ఆయన వివరించారు. తమిళనాడు వంటి ప్రగతిశీల రాష్ట్రాన్ని కూడా ఈ సమస్యలు పీడిస్తాయని ఆయన అన్నారు. ఇదే సమయంలో బ్రిటిష్ నీతి అయిన విభజించు పాలించును అనుసరిస్తున్న రాజకీయాలను కూడా ఆయన విమర్శించారు.
స్టాలిన్ ప్రతిస్పందన..
గవర్నర్ వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్ లో స్పందించారు. ‘‘హిందీని అంగీకరిస్తేనే విద్యకు నిధులు ఇస్తామని చెప్పే దురహంకారానికి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. విద్యలో మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తూ రాష్ట్ర స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని, గవర్నర్ తో సహ గుర్తు తెలియన శక్తులు పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు.
‘‘శాస్త్రీయ దృక్ఫథం తయారు చేసే సంస్థలలో మూఢనమ్మకాలు, కల్పిత కథలను వ్యాప్తి చేయడం ద్వారా యువతరాన్ని ఒక శతాబ్దం వెనక్కి లాగడానికి జరిగే కుట్రకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము’’ అని స్టాలిన్ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి చట్టపరమైన పోరాటాలు చేస్తామని చెప్పారు.
‘‘రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి గవర్నర్ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా మేము ప్రతిసారి కోర్టుకు వెళ్తాము. రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వారిపై పోరాడుతూనే ఉంటాము’’ అన్నారు.
కలైంజర్ విశ్వవిద్యాలయ బిల్లు..
తమిళనాడు గవర్నర్- ప్రభుత్వం మధ్య కొత్త వివాదానికి కేంద్రంగా కలైంగర్ బిల్లు మారింది. తమిళనాడు అసెంబ్లీ 2025 ఏప్రిల్ లో కలైంగర్ విశ్వవిద్యాలయ బిల్లు ఆమోదించి, గవర్నర్ కు పంపింది.
కుంభకోణంలో దివంగత డీఎంకే నాయకుడు, మాజీ సీఎం ఎం. కరుణానిధి గౌరవార్థం కొత్త సంస్థను స్థాపించడానికి ఉద్దేశించింది. ఈ బిల్లు అత్యంత వివాదాస్పదంగా సీఎం స్టాలిన్ నే కొత్త వైస్ ఛాన్సలర్ గా నామినేట్ చేసింది.
ఇది విద్యారంగాన్ని రాజకీయాలతో నింపేస్తుందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ రవి బిల్లుకు ఆమోదం తెలపకుండా నిలిపివేశారు. బిల్లును రాష్ట్రపతికి సిఫార్సు చేశారు.ఇది ఆమోదం పొందడానికి అడ్డంకిగా మారిందని డీఎంకే ప్రభుత్వం అసహనంగా ఉంది.
బిల్లులపై గవర్నర్ ఆమోదం తెలపకుండా నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు ఏప్రిల్ 2025 లో ఇచ్చిన తీర్పు తరువాత ఈ ఘర్షణలు ముదిరాయి. ఈ తీర్ఫు రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ ఒక క్రమ పద్దతిలో అణచివేస్తున్నారని వ్యాఖ్యానించినట్లు అయింది.
బిల్లును ఆమోదించాలని కోరుతూ డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే నెల నుంచి ఈ పిటిషన్ పై విచారణలు జరగనున్నాయి.
వీసీకే పార్టీ నాయకుడు తోల్ తిరుమావళవన్ ది ఫెడరల్ తో మాట్లాడారు. ‘‘గవర్నర్ డీఎంకే సైద్దాంతిక కట్టుబాట్లను ఒక రాజకీయ కార్యకర్తల అపహస్యం చేస్తున్నారు’’ అని విమర్శించారు. గవర్నర్ తన విధులు, పరిధికి మించి రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారని ఇది ఆయనకు అలవాటే అని చెప్పారు.
డీఎంకే విభజన రాజకీయాలు..
తమిళనాడు ప్రగతిశీల రాష్ట్రమని డీఎంకే చెప్పుకుంటున్నప్పటికీ దళితుల హక్కులు మాత్రం ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరోపించారు. ఇక్కడ విద్యా, అక్షరాస్యత స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికి ఇతరుల హక్కులు ప్రశ్నార్థకంగా ఉన్నాయని అన్నారు.
విద్యా స్థాయి ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారంటే తనకు ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. అక్షరాస్యత మాత్రమే వివక్షతను మార్చదు. ఉన్నత కులం, తక్కువ కులం అనే సోపానక్రియను మార్చడానికి ఏకైక మార్గం సామాజిక సంస్కరణ. కానీ రాజకీయ పార్టీలు మాత్రం విభజన వాదాన్ని ప్రొత్సహిస్తున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.
గవర్నర్ తప్పుగా మాట్లాడుతున్నారు: కాంగ్రెస్
దళితులపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా, రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని డీఎంకే భాగస్వామి పక్షమైన కాంగ్రెస్ ఆరోపించింది. గవర్నర్ ఆర్.ఎన్ రవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే. సెల్వ పెరుంతగై అన్నారు.
‘‘తమిళనాడులో దళితులు తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్నారని గవర్నర్ చేసిన వ్యాఖ్యల పూర్తిగా అబద్దం. ఇది నిగూఢ రాజకీయ వ్యాఖ్యలు. ఇది దళిత సమాజం వాస్తవికతను వక్రీకరించడమే. ఇది రాష్ట్ర సామాజిక చరిత్రను అగౌరవపరుస్తుంది’’ అని ఆయన ‘ది ఫెడరల్’ తో అన్నారు.
గవర్నర్ నుంచి ఇది బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు అని తమిళనాడును కించపరిచే ఏ పదాలను కూడా కాంగ్రెస్ తిరస్కరిస్తుందన్నారు. తమిళనాడు అంటే దాని ప్రజలు హృదయాలలో సమానత్వం, ఆత్మగౌరవంతో కూడిన భూమి అని ఉంటుందని సెల్వపెరుంతగై చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు..
తమిళనాడు అసెంబ్లీకి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లను రాల్చుకోవడానికి డీఎంకే పోరాటం కథనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో సుప్రీంకోర్టు గవర్నర్, రాష్ట్రపతి పై అదే తీర్పును కొనసాగిస్తే గవర్నర్ల అధికారులపై పరిమితులు ఏర్పడతాయి.
తమిళనాడు మంత్రి దురై మురుగన్ ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ ప్రతిపక్ష నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు. గవర్నర్ కు తగిన గౌరవం, హోదాను ఆయన గాలికి వదిలేశారు. తక్కువ స్థాయి చర్చలలో మునిగితేలుతున్నారు. అందువల్ల మేము ఆయనను గవర్నర్ లా గౌరవించము. ఆయన గురించి మాట్లాడము’’ అన్నారు.