ఉన్నికృష్ణన్ బెంగళూరు నివాసంలో సిట్ తనిఖీలు
శబరిమల ఆలయం నుంచి బంగారం మాయం కేసులో వేగం పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం..
శబరిమల(Sabarimala) ఆలయం నుంచి బంగారం మాయం కేసులో సిట్(SIT) అధికారులు శనివారం ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్(Unnikrishnan) బెంగళూరు నివాసాన్ని, బళ్లారిలోని ఒక ఆభరణాల దుకాణంలో సోదాలు నిర్వహించారు. గతంలో ఉన్నికృష్ణన్ పూజారిగా పనిచేసిన అయ్యప్ప ఆలయాన్ని కూడా సందర్శించారు. తరువాత ఉన్నికృష్ణన్‌ను చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. 2019లో అక్కడే ఎలక్ట్రోప్లేటింగ్ పని జరిగింది.
బంగారు కడ్డీలు స్వాధీనం..
గర్భగుడి తలుపునకు బంగారు పూతకు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవర్ధన్ అనే వ్యక్తి ఆభరణాల దుకాణాన్ని SIT అధికారులు తనిఖీ చేసి, బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న బంగారం.. 2019లో ఎలక్ట్రోప్లేటింగ్ కోసం పంపిన రాగి పలకల నుంచి తీసిందా? లేదా? అన్నది నిర్దారించాల్సి ఉంది. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ఇప్పటికే గోవర్ధన్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉన్నికృష్ణన్‌ను అక్టోబర్ 30 వరకు SIT కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగిసేలోపు ఆధారాలన్ని సేకరించాలని సిట్ లక్ష్యంగా పెట్టుకుంది.
అసలు ఏంటీ ఈ వివాదం?
శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించడం జరిగింది. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది. అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.