రాహుల్ ‘ఓటర్ అధికార్ యాత్ర’ ఎక్కడి నుంచి? ఎప్పటి వరకు?

ప్రజాస్వామ పరిరక్షణ కోసం ఆగస్టు 17 నుంచి బీహార్‌లో ప్రారంభం.. 30న అర్రాలో యాత్ర ముగింపు..సెప్టెంబర్ 1న పాట్నాలో మెగా ర్యాలీ..;

Update: 2025-08-14 09:45 GMT

కేంద్రంలోని ఎన్డీఏ(NDA) ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం(EC) కుమ్మకై ‘‘ఓట్ల దొంగతనానికి’’ పాల్పడుతున్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మహదేవపురం సెగ్మెంట్‌లో ఓటరు జాబితాలో తప్పుల తడకలపై ప్రెసెంటేషన్‌ ఇచ్చి ఈసీకి సవాల్ విసిరారు.


బీహార్‌లో మొదలు..

కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడం, ఓట్ల దొంగతనానికి ఎలా పాల్పడుతున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించి, ఆ పార్టీని అసహ్యించుకునేలా చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముందుగా బీహార్(Bihar) రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అక్కడి నుంచే ‘‘ఓటరు అధికార్ యాత్ర’’ను మొదలుపెడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా కొన్ని లోపాలు బయటపడడం కాంగ్రెస్‌కు ప్లసైంది. బీహార్ ఓటరు మింటాదేవి అనే మహిళ వయసు 35 ఏళ్లు కాగా.. ఓటరు కార్డులో ఆమె వయసు 124 సంవత్సరాలుగా కనపర్చడంపై హస్తం పార్టీ ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టింది. దీనిపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశాయి కూడా.


‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికే..’’

"ఓట్ల దొంగతానానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యాం. అందులో భాగంగానే ‘‘ఓటరు అధికార్ యాత్ర’’(Voter Adhikar Yatra)ను ఆగస్టు 17 నుంచి బీహార్ నుంచి మొదలుపెడుతున్నాం. ఇది కేవలం ఎన్నికలకు సంబంధించిన సమస్య కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేపట్టిన యుద్ధం’’ అని రాహుల్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు.

యాత్ర 17 నుంచి ప్రారంభం..

‘ఓటరు అధికార్ యాత్ర’ ఆగస్టు 17న ససారంలో మొదలవుతుంది. గయా, ముంగేర్, భాగల్‌పూర్, కతిహార్, పూర్నియా, మధుబని, దర్భంగా, పశ్చిమ్ చంపారన్ జిల్లాల మీదుగా యాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఇతర మహాఘట్బంధన్ నాయకులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగస్టు 30న అర్రాలో యాత్ర ముగుస్తుంది. సెప్టెంబర్ 1న బీహార్ రాజధాని పాట్నాలో మెగా ఓటరు అధికార్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. యాత్ర పర్యవేక్షణ ఏర్పాట్లను ఆయా జిల్లాల కోఆర్డినేటర్లు పరిశీలిస్తున్నారు. బీహార్‌లో SIR ద్వారా బీజేపీ ఎలా ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందో చెప్పడమే ఈ యాత్ర ముఖ్యోద్దేశం. సెప్టెంబర్ 1న పాట్నాలోని గాంధీ మైదానంలో యాత్ర ముగుస్తుంది. చివరి రోజు ఇండియా బ్లాక్ సీనియర్ లీడర్లంతా హాజరుకానున్నారు.


‘లోక్‌తంత్ర బచావో మషాల్ మార్చ్..’

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో " లోక్‌తంత్ర బచావో మషాల్ మార్చ్" ఉంటుందని, ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు అన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లో కాంగ్రెస్ "ఓటు చోర్, గడ్డి చోర్ (ఓటు దొంగలు, అధికారాన్ని వదులుకోండి)" ర్యాలీలు నిర్వహించనున్నట్లు (NSUI) AICC ఇన్‌చార్జ్ కన్హయ్య కుమార్ తెలిపారు.


సంతకాల సేకరణ..

ఈ రెండింటితో పాటు నెల రోజుల పాటు ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఐదు కోట్ల సంతకాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చెప్పారు. సేకరించిన ఈ సంతకాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించనున్నారు. ప్రజలు మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్ల దొంగతనానికి సంబంధించి ఇప్పటికే ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News