‘మతపెద్దల తొలగింపు ప్రతీకార చర్యే’

పంజాబ్‌లో మతపెద్దల తొలగింపును ఖండించిన సీఎం భగవంత్ మాన్.;

Update: 2025-03-08 11:55 GMT

అకాల్ తఖ్త్, తఖ్త్ శ్రీ కేస్‌గఢ్ సాహిబ్‌కు చెందిన ఇద్దరు జథేదార్ల (మతపెద్దలు) తొలగింపును పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తప్పుబట్టారు. వారిని పక్కనపెట్టడాన్ని ప్రతీకార చర్యగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అమృత్‌సర్‌లోని అకాల్ తఖ్త్‌‌కు గ్యాని రఘబీర్ సింగ్, రూప్‌నగర్ జిల్లా ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని తఖ్త్‌‌కు శ్రీ కేస్‌గఢ్ సాహిబ్‌కు గ్యాని సుల్తాన్ సింగ్‌ జథేదార్లు(Jathedars)గా వ్యవహరిస్తున్నారు. వీరిని తొలగిస్తూ షిరోమణి గురుద్వారా నిర్వాహక కమిటీ (SGPC) నిర్ణయం తీసుకుంది. సుల్తాన్ సింగ్‌ స్థానంలో కొత్తగా సిక్కు పండితుడు గ్యాని కుల్దీప్ సింగ్ గడ్గజ్‌ను నియమించింది. అకాల్ తఖ్త్ జథేదార్‌గా మరొకరు వచ్చేవరకు కుల్దీప్ సింగ్‌కే తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు.

సీజీపీసీ నిర్ణయంపై మాన్ ఆగ్రహం..

SGPC నిర్ణయంపై సీఎం భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann) స్పందించారు. "ఇది మతపరమైన విషయం. మతం నుంచి రాజకీయాలు నేర్చుకోవాలి. కానీ ప్రస్తుతం రాజకీయాలే మతానికి నేర్పిస్తున్నాయి," అని వ్యాఖ్యానించారు. SGPCకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలని మాన్ అభిప్రాయపడ్డారు.

శిరోమణి అకాలీ దళ్‌పై విమర్శలు..

శిరోమణి అకాలీ దళ్ ( Shiromani Akali Dal) నేతలు ముఖ్యంగా సుఖబీర్ సింగ్ బాదల్‌నుద్దేశించి మాన్ మాట్లాడుతూ.. "మీరు మీ తప్పులకు మతపర శిక్ష ('టంకాహ్')అనుభవించారు. ఇప్పుడు మీరే జథేదార్లను తొలగించాలనుకుంటున్నారు. ఇది పగ తీర్చుకునే చర్యగా అనిపిస్తోంది." అని అన్నారు.

అకాల తఖ్త్ నిర్ణయం..

2007-2017 మధ్య శిరోమణి అకాలీ దళ్ ప్రభుత్వం చేసిన "తప్పిదాలు"పై గతేడాది డిసెంబర్ 2న మతపరమైన శిక్షను విధించింది అకాల్ తఖ్త్. ఆ సమయంలో తీర్పు చెప్పిన ఐదుగురి మతపెద్దల్లో గ్యాని రఘబీర్ సింగ్, గ్యాని సుల్తాన్ సింగ్, గ్యాని హర్ప్రీత్ సింగ్‌ ఉన్నారు. ఫిబ్రవరి 10న గ్యాని హర్ప్రీత్ సింగ్‌ను తఖ్త్ శ్రీ దమ్‌డమా సాహిబ్ జథేదార్ పదవి నుంచి తొలగించారు.

తీవ్ర నిరసనలు..

గ్యాని హర్ప్రీత్ సింగ్ మతపెద్దలను తొలగించడాన్ని ఖండించారు. "ఇది సిక్కు సమాజానికి చీకటి రోజు," అని ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది రాజకీయ నేతలు కూడా ఈ చర్యను తప్పుబట్టారు. అకాల్ తఖ్త్ అధికారాన్ని "రాజకీయ ప్రయోజనాల కోసం" వాడుకుంటోందని మండిపడ్డారు. 

Tags:    

Similar News