Farmers Agitation | 3 గంటల పాటు 'రైల్ రోకో’
పంటలకు కనీస మద్దతు ధరతో పాటు వివిధ డిమాండ్లను ఆమోదించాలని బుధవారం రైతులు పంజాబ్‌లో పలు చోట్ల 'రైల్ రోకో' చేపట్టారు.;
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా రైతులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు వివిధ డిమాండ్లను ఆమోదించాలని బుధవారం రైతులు పంజాబ్‌లో పలు చోట్ల మూడు గంటల పాటు 'రైల్ రోకో' చేపట్టారు. 'రైల్ రోకో' నిరసనకు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు గురుదాస్‌పూర్‌లోని మోగా, ఫరీద్‌కోట్, కడియన్, బటాలాలో నిరసనను నిర్వహించాలని భావించారు.
పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో..
సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్, హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు వద్ద
ఆందోళన చేపడుతున్నాయి. అయితే వారికి ఢిల్లీలోకి అనుమతించకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గత మూడు వారాలుగా పంజాబ్ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పంజాబ్, హర్యానా మధ్య ఖనౌరీ సరిహద్దు పాయింట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
101 మంది రైతుల సమూహం డిసెంబరు 6, డిసెంబర్ 8, డిసెంబర్ 14న కాలినడకన ఢిల్లీలోకి ప్రవేశించడానికి మూడుసార్లు ప్రయత్నించింది. హర్యానా భద్రతా సిబ్బంది వారిని ముందుకు సాగనివ్వలేదు. పంటలకు చట్టపర హామీతో పాటు, రైతులు రుణమాఫీ, రైతులకు, రైతు కూలీలకు పింఛన్, విద్యుత్ ఛార్జీల పెంపు, పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.