జో బైడెన్, ట్రూడోతో సమావేశమైన భారత ప్రధాని.. ఏం మాట్లాడుకున్నారంటే..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా, అమెరికా దేశాధినేతలతో సమావేశం అయ్యారు. నిజ్జర్ హత్య కేసు, గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కేసులో ఈ రెండు దేశాలు ..
By : Praveen Chepyala
Update: 2024-06-15 05:36 GMT
కెనడా ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇటలీలో జరుగుతున్న జీ7 మీటింగ్ సందర్భంగా ఇరుదేశాల ప్రధానులు కొద్ది సేపు ముచ్చటించారు. గత ఏడాది ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. భారత్- కెనడాలు రెండు దేశాలు ఈ విషయంలో తీవ్ర స్వరంతో హెచ్చరించుకున్నాయి.
ఇటలీలోని అపులియా ప్రాంతంలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో కూడా మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. న్యూయార్క్‌లో సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు విఫలమైన కుట్రతో భారత్‌కు సంబంధం ఉందని వాషింగ్టన్ ఆరోపణలు చేసిన దాదాపు ఏడు నెలల తర్వాత మోదీ-బిడెన్ మధ్య సంభాషణ జరిగింది.
ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని నియమించింది. బైడెన్‌తో పరస్పర చర్చల అనంతరం మోదీ మాట్లాడుతూ, ప్రపంచ ప్రయోజనాల కోసం భారత్, అమెరికా కలిసి పనిచేస్తాయని అన్నారు.
జో బైడెన్ ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. భారత్- యూఎస్ఏ రెండు దేశాలు ప్రపంచ దేశాల ప్రయోజనం కోసం కలిసి పని చేస్తూనే ఉంటాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని ట్రూడో తో కలిసిన ఫోటోను సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. "G7 సమ్మిట్‌లో కెనడియన్ PM @JustinTrudeauని కలిశారు. ప్రధానిని కలవడం ఆనందంగా ఉంది" అన్నారు. మీటింగ్ సమయంలో మోదీ- ట్రూడో ఇద్దరూ ఒకరికొకరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. మోదీ, ట్రూడ్ ఏం మాట్లాడుకున్నారో బయటకు తెలియరాలేదు.
బ్రిటీష్ కొలంబియాలో నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్‌లో చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
న్యూ ఢిల్లీ ట్రూడో ఆరోపణలను "అసంబద్ధం", "ప్రేరేపితమైనది" అని తిరస్కరించింది. రెండు దేశాల మధ్య ప్రధాన సమస్య కెనడా గడ్డపై శిక్షార్హత లేకుండా పనిచేస్తున్న ఖలిస్థాన్ అనుకూల ఎలిమెంట్స్‌కు కెనడా చోటు కల్పించడమేనని భారత్ వాదిస్తోంది.
విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా బుధవారం మాట్లాడుతూ, కెనడాతో భారతదేశం ప్రధాన సమస్య తీవ్రవాదం, హింసను సమర్థించే భారతదేశ వ్యతిరేక అంశాలకు ఒట్టావా కేంద్రంగా మారి, వారికి అండదండలు అందిస్తోందని అన్నారు. కెనడాకు భారతదేశం తన "లోతైన ఆందోళనలను" పదేపదే తెలియజేసిందని, ఆ అంశాలకు వ్యతిరేకంగా ఒట్టావా గట్టి చర్య తీసుకోవాలని న్యూ ఢిల్లీ ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గత ఏడాది జూన్ 18న సర్రేలోని బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వెలుపల ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్‌ను కొంతమంది వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (RCMP) విచారణ జరుపుతున్నారు.