కేరళ నన్స్‌తో ములాఖత్‌కు అనుమతించని పోలీసులు
పోలీసులతో వామపక్ష ఎంపీల వాగ్వాదం-పార్లమెంట్ ఆవరణలోనూ నిరసన వ్యక్తం చేసిన యూడీఎఫ్ ఎంపీలు..;
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఇటీవల ఇద్దరు క్రైస్తవ నన్‌ల అరెస్టుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. వారు మతమార్పిడులకు పాల్పడుతున్నారని కొందరంటుండగా.. అనవసరంగా ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చేస్తున్నారని వామపక్షనేతలంటున్నారు.
మానవ అక్రమరవాణ, మతమార్పిడికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో కేరళకు చెందిన ఇద్దరు క్రైస్తవ నన్స్(Kerala Nuns), ఒక గిరిజనుడిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక బజరంగ్ దళ్(Bajrang Dal) సభ్యుడు రవినిగమ్ ఫిర్యాదు ఆధారంగా నన్స్ ప్రీతి మేరీ, వందనా ఫ్రాన్సిస్, నారాయణపూర్‌కు చెందిన సుకమన్ మండావీని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఉద్యోగాల పేరుతో మహిళలను అగ్రాకు తీసుకెళ్లి మతమార్పిడికి ప్రయత్ని్స్తున్నారన్నది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే ఈ మతమార్పిడి ఆరోపణలను బాధితుల కుటుంబసభ్యులు ఖండించారు. ఒక యువతికి సోదరి మాట్లాడుతూ “మా తల్లిదండ్రులు లేరు. నా చెల్లెలు అగ్రాలో నర్సింగ్ ఉద్యోగం చేయాలనుకుంది. అందుకే నేను ఆమెను వారితో పంపించాను. నేను గతంలో లక్నోలో అదే సంస్థతో పనిచేశాను, ” అని చెప్పారు. మరో బంధువు మాట్లాడుతూ ..“మా కుటుంబం ఐదేళ్ల క్రితమే క్రైస్తవ మతంలోకి మారింది. నా చెల్లెలు జూలై 24న స్వచ్ఛందంగా బయలుదేరింది. నన్స్‌లు, మండావీ అరెస్ట్ రాజకీయ కుట్రే. వెంటనే వారిని విడుదల చేయాలి” అని పేర్కొన్నారు.
జూలై 26న బాధిత యువతుల కుటుంబాలు స్థానిక పోలీసులకు రాతపూర్వకంగా రాసిచ్చారు. తమ కుమార్తెలను స్వచ్ఛందంగా ఉద్యోగావకాశాల కోసం పంపించామని ప్రకటించారని నారాయణపూర్ ఎస్‌పీ రాబిన్సన్ గురియా తెలిపారు.
దేశవ్యాప్తంగా నిరసనలు..
ఈ అరెస్టులపై దేశవ్యాప్తంగా క్రైస్తవ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, మతపరమైన నేతలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఢిల్లీతో పాటు కేరళ(Kerala)లోని అనేక జిల్లాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. బిషప్స్ అసోసియేషన్ ఒ ప్రకటన జారీ చేసింది. “నిర్దోషులైన నన్స్‌లను రాజకీయాల్లో లాగి వేధించడం తగదు. వారు నిరపరాధులు. వెంటనే విడుదల చేయాలి” అని డిమాండ్ చేసింది.
‘తీవ్రమైన నేరం’
నన్స్‌ల అరెస్టుపై ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) సీఎం విష్ణుదేవ్ సాయ్ స్పందించారు. “మానవ అక్రమ రవాణ తీవ్రమైన నేరం. పైగా మతమార్పిడికి సంబంధించిన అంశం’’ అని పేర్కొన్నారు. ‘‘నారాయణపూర్‌కు చెందిన ముగ్గురు యువతులు నర్సింగ్ శిక్షణతో ఉద్యోగ వాగ్దానాల పేరుతో నన్స్‌లకు అప్పగించారు. అగ్రాకు తీసుకెళ్తుండగా మతమార్పిడి చేయాలన్న ప్రయత్నం జరిగింది. ఇది బస్తర్ ప్రాంతంలోని యువతుల భద్రతకు సంబంధించిన వ్యవహారం. దీనిపై విచారణ కొనసాగుతోంది.’’ అని సాయ్ X (మాజీ ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
‘అవన్నీ అవాస్తవం’
"భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నట్లుగా నన్స్‌లు ప్రీత మేరీ, వందన ఫ్రాన్సిస్ మానవ అక్రమ రవాణాదారులు కాదు. మతమార్పిడి చేసేవారు కాదు" అని బీజేపీ కేరళ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం (జూలై 29) న్యూఢిల్లీలో అన్నారు. బజరంగ్ దళ్ బీజేపీకి అనుబంధం కాదని, అది ఒక స్వతంత్ర సంస్థ అని పేర్కొన్నారు. కేరళలోని పార్టీకి వారి చర్యలలో ఎలాంటి సంబంధం లేదన్నారు.
‘అవి తప్పుడు ఫిర్యాదులు’
"బజరంగ్ దళ్ కార్యకర్తలు తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నన్స్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. క్రైస్తవ సమాజంపై సంఘ్ పరివార్ దురాక్రమణకు ఇది తాజా ఉదాహరణ. దేశం సహజీవన స్ఫూర్తిని చూసి సంఘ్ పరివార్ భయపడుతోంది. అందుకే మైనారిటీలపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు.
పరామర్శకు నిరాకరణ..
అరెస్టు చేసిన నన్స్‌ను పరామర్శించాలని వెళ్లిన సీపీఐ(ఎం) సీపీఐ ఎంపీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మేము నన్స్‌లను కలవడానికి ఒకరోజు ముందుగానే దరఖాస్తు చేసుకున్నాము. కానీ రాయ్‌పూర్ పోలీసులు రాజకీయ నాయకుల జోక్యంతో మాకు అనుమతి నిరాకరించారు. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా సంఘ్ పరివార్ ఎజెండాకు అనుగుణంగా ఉన్నాయి.
క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ అవమానిస్తోంది. వారికి ఆరోగ్య సమస్యలున్నా.. నేలపై పడుకోవలసి వస్తోంది, ”అని వామపక్ష నాయకుల ప్రతినిధి బృందా కారత్ అన్నారు. నన్స్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పార్లమెంటు ఆవరణలో అనేక మంది యుడిఎఫ్ ఎంపీలు డిమాండ్ చేశారు.