సమ్మిట్‌కు ముందే పెట్టుబడుల సందడి..!

విశాఖలో శుక్ర, శనివారాల్లో జరగనున్న పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు ఒకరోజు ముందే పెట్టుబడుల సందడి మొదలైంది.

Update: 2025-11-13 14:31 GMT
ప్రతిని«ధుల బృందంతో ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శుక్ర, శనివారాల్లో విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఇందుకవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సమ్మిట్‌లో 410 ఎంవోయూలు కుదుర్చుకుని, రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ఒప్పందాలన్నీ శుక్ర, శనివారాల్లో జరుగుతాయని అంతా భావించారు. కానీ ప్రభుత్వం అనూహ్యంగా వీటిలో కొన్ని ఎంవోయూలను గురువారమే కుదుర్చుకుంది.


ఇండియా–యూరప్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చంద్రబాబు

ముందు రోజు రూ.3.65 లక్షల కోట్లకు ఎంవోయూలు..
పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు రెండు రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్‌లు బుధవారం రాత్రే విశాఖ చేరుకున్నారు. ఆ రాత్రి నుంచే సమ్మిట్‌కు సంబంధించిన ఎంవోయూలపై వీరిద్దరూ దృష్టి సారించారు. గురువారం ఉదయమే కొన్ని సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోవాలని నిర్ణయించి అందుకవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారుల ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. ఇలా గురువారం ఆరు సంస్థలతో రూ.3.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా లక్షా 26 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు.

 హీరో ఫ్యూచర్స్‌ ఎనర్జీ సీఎండీ రాహుల్‌ మంజూల్‌తో సీఎం భేటీ 

ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలివీ..
గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల (ఎంవోయూల)ను పరిశీలిస్తే..
+ రెన్యూ పవర్‌ రూ.82 వేల కోట్లు, ఈజోల్‌ రూ.19 వేల కోట్లు, ౖలె వాన్‌ ప్రైవేటు ఇండస్ట్రియల్‌ పార్క్‌ రూ.1,200 కోట్లు, కోరమాండల్‌ రూ.2,000 కోట్లు, హీరో ఫ్యూచర్‌ ఎనర్జీ రూ.15,000 కోట్లు, జూల్‌ రూ.1,500 కోట్లు. ఈడీబీతో రూ.60 వేల కోట్లు, పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
మరో 29 సంస్థలతో ఎంవోయూలకు సిద్ధం..
గురువారం రాత్రికల్లా రాష్ట్ర ప్రభుత్వం మరో 29 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో ఏపీ సీఆర్డీయే ఎనిమిది, ఇంధన రంగంలో ఐదు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో నాలుగు, ఐ అండ్‌ ఐలో మూడు, ఇండస్ట్రీస్‌లో తొమ్మిది ఒప్పందాలు చేసుకోనుంది. వీటి పెట్టుబడుల విలువను ఇంకా వెల్లడించ లేదు.
విశాఖలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..
బుధవారం రాత్రి విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్నుంచి బిజీ బిజీగానే ఉన్నారు. మరోవైపు మంత్రి లోకేష్‌ కూడా సమ్మిట్‌లో ఒప్పందాలు చేసుకునే సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరువురూ సమ్మిట్‌కు ముందు రోజే కొన్ని ఒప్పందాలు జరిగేలా చూశారు. బుధవారం రాత్రి చంద్రబాబుతో భారత్‌ ఫోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ అమిత్‌ కల్యాణి సమావేశమయ్యారు. గురువారం ఉదయం నోవోటెల్‌ హోటల్‌లో ఇండియా–యూరప్‌ బిజినెస్‌ పార్టనర్‌షిప్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. యూరోపియన్‌ పెట్టుబడులు, గ్రీన్‌ షిఫ్ట్, సస్టెయినబుల్‌ ఇన్నోవేషన్‌ వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు విశాఖలో ఉన్న ఐటీ, ఇతర పరిశ్రమల పెట్టుబడుల అనుకూలతలను ప్రతినిధులకు వివరించారు. అలాగే కుప్పంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుపై తైవాన్‌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఇంకా గ్లోబల్‌ ఇండస్ట్రీ జెంయింట్లతోనూ, ఇటాలియన్‌ ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ ఏర్పాటుపై సీఎం సమావేశమయ్యారు. ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ కమాండర్‌ ఇన్‌ ఛీప్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లాతోనూ సీఎం భేటీ అయి రక్షణ రంగం, షిప్‌ బిల్డింగ్‌ రంగంలో సహకారంపై చర్చించారు. ఇటలీ రాయబారి ఆంటోనియో హెన్రికో బార్జోలీ సీఎంను కలిసి పెట్టుబడులపై చర్చించారు.
Tags:    

Similar News