బడ్జెట్‌పై మోదీ ప్రశంస-రాహుల్ విమర్శ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు.కాగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ విమర్శించారు.

Update: 2024-07-23 11:08 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. మధ్యతరగతి ప్రజలను బలోపేతం చేయడమే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించామని, విద్య, నైపుణ్యాల అభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏం చేయలేకపోయారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ విమర్శించారు.

సాధికారత బడ్జెట్..

బడ్జెట్‌ విద్య, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ‌డ్జెట్ మ‌హిళ‌ల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందన్నారు. చిన్న వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈఎస్‌లకు ఈ బడ్జెట్ కొత్త మార్గాన్ని చూపిందన్నారు. గత పదేళ్లలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ చెప్పారు. బడ్జెట్ మధ్యతరగతి ఆకాంక్షలకు మరింత శక్తినిస్తుందని, యువ తరానికి అపూర్వ అవకాశాలిస్తుందన్నారు. బడ్జెట్ మునుపెన్నడూ లేని విధంగా మధ్యతరగతి వర్గాలకు సాధికారత చేకూరుస్తుందన్నారు.

బడ్జెట్‌పై రాహుల్ విమర్శ..

రాహుల్ గాంధీ ఎక్స్‌ వేదికగా బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను "మిత్రకాల్ బడ్జెట్"గా అభివర్ణించారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. "కుర్సీ బచావో" అంటూ మిత్రపక్షాలను బుజ్జగించడంలో భాగంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అని విమర్శించారు. 

Tags:    

Similar News