జవాన్లు లేకుండా భారత్ నంబర్ స్థానాన్ని చేరుకోలేదు: అమిత్ షా

దేశంలో సమగ్ర యాంటీ డ్రోన్ విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.

By :  491
Update: 2024-12-08 11:40 GMT

భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించిన వందో సంవత్సరానికి దేశం నంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంటుందని, ఇది జవాన్లు లేకుండా సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అలాగే రాబోయే కాలంలో మానవ రహిత విమానాలతో(యూఏవీ) దేశ సరిహద్దులకు ముప్పు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని కూడా అమిత్ షా చెప్పారు. భారత సరిహద్దులు సురక్షితంగా ఉండటానికి తగిన ప్రణాళికలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

జోధ్‌పూర్‌లో 60వ రైజింగ్ డే కార్యక్రమంలో BSF దళాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న "లేజర్ అమర్చిన యాంటీ-డ్రోన్ గన్-మౌంటెడ్" మెకానిజం ప్రారంభ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు. దీనివల్ల పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో డ్రోన్ న్యూట్రలైజేషన్, డిటెక్షన్ కేసులు 3 శాతం నుంచి 55 శాతానికి పెరిగాయని ఆయన చెప్పారు.
260కి పైగా డ్రోన్లను కూల్చివేశాం..
“ రాబోయే రోజుల్లో డ్రోన్ ముప్పు మరింత తీవ్రం కానుంది... రక్షణ, పరిశోధన సంస్థలు మరియు DRDO చేతులు కలపడంతో మేము ఈ సమస్యను ప్రభుత్వ విధానంతో పరిష్కరిస్తున్నాము. రాబోయే కాలంలో దేశం కోసం సమగ్ర యాంటీ డ్రోన్ యూనిట్‌ని రూపొందించబోతున్నాం’’ అని షా చెప్పారు.
అధికారిక సమాచారం ప్రకారం, 2023లో సుమారు 110 డ్రోన్‌లు కూల్చివేయగా, ఈ సంవత్సరం వరకూ 260 డ్రోన్లు కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చాయని ఆక్షేపించారు. ఆయుధాలు - మాదకద్రవ్యాలను మోసుకెళ్ళే డ్రోన్‌ల సమస్య గరిష్ట స్థాయిలో పంజాబ్, రాజస్థాన్, జమ్మూలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ (2,289 కి.మీ), బంగ్లాదేశ్ (4,096 కి.మీ)తో భారతదేశ సరిహద్దులను భద్రపరచడానికి కొనసాగుతున్న సమగ్ర సమీకృత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ (సిఐబిఎంఎస్) పురోగతిలో ఉందని షా చెప్పారు. " అస్సాంలోని ధుబ్రి (భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు)లో నదీతీర సరిహద్దులో మోహరించిన CIBMS నుంచి మాకు ప్రోత్సాహకరమైన ఫలితాలు వచ్చాయి, అయితే కొన్ని మెరుగుదలలు అవసరం," అని షా చెప్పారు.
వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్
ఉత్తర సరిహద్దుల ప్రాంతాలను అభివృద్ధి చేసి అక్కడి ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ (వివిపి) దేశంలోని అన్ని సరిహద్దు గ్రామాలకు అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
48,000 కోట్ల నిధుల కేటాయింపుతో సరిహద్దు భద్రతను పెంపొందించడం, ఈ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల కోసం పని చేయడంలో మోదీ ప్రభుత్వం సాధించిన “అతిపెద్ద విజయం” ఇదే అన్నారు. ఇది దాదాపు 3,000 గ్రామాల్లో "ప్రయోగాత్మక ప్రాతిపదికన" అమలు చేస్తామని ఆయన చెప్పారు. భారత సరిహద్దుల పటిష్టతలో భాగంగా ఫెన్సింగ్, సరిహద్దు మౌలిక సదుపాయాలు, రోడ్లు ఇతర లాజిస్టిక్స్ కోసం కేంద్ర ప్రభుత్వం "పెద్ద" బడ్జెట్‌ను మంజూరు చేసిందని షా చెప్పారు.
"2047 నాటికి భారతదేశానికి ప్రపంచ గుర్తింపు, నంబర్ వన్ స్థానాన్ని పొందడం మన భద్రతా సిబ్బంది లేకుండా సాధ్యం కాదు. మన సరిహద్దులను అంకితభావంతో కాపాడేది జవాన్లే" అని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం 1,812 కి.మీ రోడ్లు కాకుండా 573 కొత్త సరిహద్దు పోస్టులను సృష్టించిందని షా చెప్పారు.
కార్యాచరణ బలం..
మంత్రి సెరిమోనియల్ పరేడ్‌ను పరిశీలించి, గౌరవ వందనం స్వీకరించి, గ్యాలంట్రీ అవార్డు విజేతలకు పతకాలు, మరికొన్ని అలంకరణలను ప్రదానం చేశారు. కొత్తగా శిక్షణ పొందిన 13,226 మంది సిబ్బందిని వివిధ బెటాలియన్‌లలో నియమించామని, ఇది దళం "కార్యాచరణ బలం"ని పెంచుతుందని BSF డైరెక్టర్ జనరల్ (DG) దల్జిత్ సింగ్ చౌదరి తెలిపారు.
కొత్తగా రిక్రూట్ అయిన మరో 4,000 మంది సిబ్బంది శిక్షణలో ఉన్నారని, 12,000 మంది సరిహద్దుల్లో నియమించబడటానికి ముందు భద్రత, పోరాట నైపుణ్యాలను నేర్చుకోవడానికి వచ్చే నెలలో దళంలో చేరతారని ఆయన చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి శత్రువులు పంపుతున్న ఆయుధాలు, మాదకద్రవ్యాలను మోసే డ్రోన్‌ల "పెరుగుతున్న సంఖ్య" గురించి కూడా చౌదరి మాట్లాడారు.
దాదాపు 2.65 లక్షల మంది సిబ్బందితో కూడిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), డిసెంబర్ 1, 1965న ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమికంగా వివిధ రకాల విధులను నిర్వర్తించడంతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో 6,300 కి.మీ కంటే ఎక్కువ భారత సరిహద్దులను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తుంది.



Tags:    

Similar News