పార్టీ బీహార్ యూనిట్ ఎక్స్ లో చేసిన ట్వీట్ ప్రకారం.. రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేశ్ రామ్ కుటుంబ సభ్యులు తాము ఏ నియోజకవర్గాలో పోటీ చేయబోతున్నారో ప్రకటించుకున్నారు.
పార్టీ కూడా అధికారిక నామినీల జాబితాను విడుదల చేయకుండానే ఎక్స్ లో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ప్రారంభించింది. ప్రకటనలతో పాటు అభ్యర్థులకు పార్టీ నామినేషన్ సర్టిఫికెట్లు అందజేసే ఫొటోలను సైతం జత చేసి పోస్ట్ చేసింది.
కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే ప్రధాన మిత్రపక్షమైన ఆర్జేడీతో మిగిలిన భాగస్వాములతో చర్చలు జరుపుతోంది. కానీ సీట్ల పంపకాలు మాత్రం ఒక కొలిక్కి రాలేదు.
తేజస్వీ యాదవ్ నామినేషన్
ఇంతకుముందే ఆర్జేడీ నాయకుడు, విపక్ష నేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించింది. మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి చివరి తేదీ అక్టోబర్ 17 కాగా, రెండో దశ నామినేషన్ దాఖలు చేయడానికి అక్టోబర్ 20 చివరి తేదీ.
తమ కుటుంబ స్థానం నుంచే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి అనుమతి ఇచ్చినందుకు రాజేశ్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ వేసినందుకు రామ్ తో పాటు ఇతరును కాంగ్రెస్ పార్టీ బీహార్ యూనిట్ అభినందించింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. శశిశేఖర్ సింగ్ వాజ్జీర్ గంజ్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. కౌశలేంద్ర కుమార్ నలంద నుంచి నామినేషన్ దాఖలు చేశారు. బర్భీఘా నుంచి త్రిశూల్ధారి సింగ్, రాజపకడ్ స్థానం నుంచి ప్రతిమాదాస్, శశిభూషన్ రాయ్ అలియాస్ గప్పు రాయ్ గోవింద్ గంజ్ స్థానం, విజేంద్ర చౌదరి ముజఫర్ పూర్ నుంచి పోటీ చేయబోతున్నారు.
గోపాల్ గంజ్ నుంచి ఓం ప్రకాశ్ గార్గ్, అమర్ పూర్ అసెంబ్లీ నుంచి జితేంద్ర సింగ్, బెగుసరాయ్ నుంచి అమితా భూషన్, సుల్తాన్ గంజ్ నుంచి లల్లన్ కుమార్ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోస్డా స్థానం నుంచి ఇండి బ్లాక్ తరఫున బీకే రవికి టికెట్ ఇచ్చింది.
బీహార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ గరీబ్ దాస్ బచ్వాడ స్థానం నుంచి, ఆనంద్ శేఖర్ సింగ్ ఔరంగాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీలలో జరగబోతున్నాయి. అదే నెల 14 న తుది ఫలితాలు వెలువడనున్నాయి.