బీహార్ సీఎం నితీశ్ పార్టీలో 'వక్ఫ్' ముసలం
నితీశ్ తమ నమ్మకాన్ని వమ్ము చేశారన్న మైనారిటీ నేతలు;
By : Praveen Chepyala
Update: 2025-04-04 05:36 GMT
పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలు కూడా లోక్ సభలో, రాజ్యసభలో ఐక్యంగా ఉన్నాయి. అయితే బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేడీ(యూ) కొంచెం తటాపటాయింపు ఉంటుందని అంతా భావించారు.
అయితే బిల్లు సభకు చేరగానే జేడీ(యూ) తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. అయితే తమ పార్టీ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ప్రకటించడంపై ఇప్పుడు పార్టీలో ఉన్న ఇద్దరు ప్రముఖ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.
సీనియర్ జేడీ(యూ) నాయకుడు మహ్మద్ ఖాసీమ్ అన్సారీ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి, తన పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం నితీశ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు.
తన అసంతృప్తిని తెలియజేస్తూ సీఎంకు ఓ లేఖను ఆయన బహిరంగంగా విడుదల చేశారు. లక్షలాది ముస్లిం ప్రజలు జేడీ(యూ)పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్మూ చేశారని ఆరోపించారు. జేడీ(యూ) తన సెక్యూలర్ విలువలను పూర్తిగా విడిచిపెట్టిందని విమర్శించారు.
‘‘లక్షలాది మంది ముస్లిం ప్రజలు మీపై , మీ పార్టీపై పెట్టుకున్న నమ్మాకాన్ని మీరు వమ్ము చేశారు. మీరు ఇన్నాళ్లు నిజమైన సెక్యూలర్ అనుకున్నాము. కానీ మీరు వక్ఫ్ సవరణ బిల్లు- 2024 ను మద్దతు ప్రకటించి దానిని వమ్ము చేశారు.
మీ నిర్ణయంలో లక్షలాది మంది ముస్లింలు షాక్ కు గురయ్యారు. లోక్ సభలో జేడీ(యూ) ఎంపీ లల్లన్ సింగ్ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో మేమంతా నిరుత్సాహానికి గురయ్యాం’’ అని లేఖలో చెప్పారు.
ఖాసీమ్ మాత్రమే కాకుండా జేడీ(యూ) కు చెందిన మరో నేత మహ్మద్ అష్రాఫ్ కూడా తన ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆయన పార్టీలో మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.
వక్ఫ్ బిల్లు భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని ఆయన ప్రకటించారు. అందుకే తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నానని పేర్కొన్నారు.