ప్రాథమిక అభివృద్ధికి మూలం మౌలిక సదుపాయాలే: మోదీ
భారత రైల్వేలకు కొత్త జవసత్వాలు నింపుతున్నామన్నా ప్రధాని
By : Praveen Chepyala
Update: 2025-11-08 07:31 GMT
అభివృద్ది అంటే పెద్ద రోడ్లు, వంతెనలే కాదని, అన్ని రంగాలు సమతూకంగా వృద్ది చెందడమే నిజమైన అభివృద్దని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చెందిన దేశాలలో ఆర్థికవృద్ధికి మౌలిక సదుపాయాలు కీలకమైన శక్తి అని, భారతదేశం కూడా అభివృద్ది పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ఆయన శనివారం అన్నారు. వారణాసిలోని బనారస్ రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభించిన తరువాత మాట్లాడిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధికి మౌలిక సదుపాయాలే ముఖ్యం..
‘‘ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ది చెందిన దేశాలలో, ఆర్థిక వృద్ధికి ప్రాథమిక కారణం. వారి మౌలిక సదుపాయాలు గణనీయమైన పురోగతి సాధించడం. ప్రతిదేశంలో, ప్రధాన చోదక శక్తి మౌలిక సదుపాయాలు విస్తరించడమే’’ అని మోదీ అన్నారు.
‘‘మౌలిక సదుపాయాలు అంటే కేవలం పెద్ద వంతెనలు, రహదారుల గురించి మాత్రమే కాదు. అటువంటి వ్యవస్థలు ఎక్కడైనా అభివృద్ధి చేయబడినప్పుడల్లా, అది ఆ ప్రాంత అభివృద్ధికి దారితీస్తుంది’’ అని మోదీ అభిప్రాయపడ్డారు.
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును ప్రధానమంత్రి చెప్పారు. ‘‘వందే భారత్ రైళ్లు చాలా వేగంగా నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమాన పరిశ్రమ వీటిని గమనిస్తోంది. ఈ పరిణామాలు అన్ని కూడా వృద్ధికి ముడిపడి ఉన్నాయి. నేడు భారత్ కూడా ఈ మార్గంలో వేగంగా ముందుకు సాగుతుంది’’ అని చెప్పారు. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి కొత్త తరం భారతీయ రైల్వేలకు పునాది వేస్తున్నాయని మోదీ అన్నారు.
యూపీ మారుతోంది..
యూపీలో తీర్థయాత్రిక ధర్మస్థలాలు గత 11 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని తీర్థయాత్రలను సందర్శించే భక్తులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయలను అందించారని, వారణాసిని సందర్శించడం, ఇక్కడ బస చేయడం అందరికీ ఒక ప్రత్యేక అనుభవంగా మార్చడమే ప్రభుత్వ ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా హజరయ్యారు.
కొత్త వందే భారత్ రైళ్లు..
కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు బనారస్- ఖజురహో, లక్నో- సహరాన్ పూర్, ఫిరోజ్ పూర్- ఢిల్ల, ఎర్నాకులం- బెంగళూర్ మార్గాల్లో నడవబోతున్నాయి.
సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రధాన స్టేషన్ల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ప్రాంతీయంగా ప్రజల అనుసంధానతను పెంచుతాయి. పర్యాటకాన్ని ప్రొత్సహిస్తాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయని అధికారిక ప్రకటన తెలిపింది. బనారస్- ఖజురహో వందే భారత్ వారణాసి, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్ వంటి ప్రముఖ సాంస్కృతిక మతపరమైన ప్రదేశాలను టచ్ చేస్తూ ప్రయాణిస్తుంది.