షా వ్యాఖ్యలకు నిరసనగా దేశ వ్యాప్త నిరసనలు: కాంగ్రెస్

జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలు నిర్వహిస్తామన్న కేసీ వేణుగోపాల్

By :  491
Update: 2024-12-23 07:39 GMT

అంబేడ్కర్ పై అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్, డిసెంబర్ 24న దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వరకు 'బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

మా డిమాండ్ ఏంటంటే..
వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా కోరుతూ జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను కించపరిచేలా ఉన్నాయని, రాజ్యాంగ విలువలను కాపాడే వారిని తీవ్రంగా గాయపరిచాయని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై ఆయన, ప్రధాని మోదీ క్షమాపణ కూడా చెప్పలేదని, ఇంకా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అలాగే జార్జ్ సోరోస్ ఫొటోతో పాటు అంబేడ్కర్ ఫొటో కలిపి అవమానించారని కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షనాయకులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.
'జై భీమ్, జై సంవిధాన్' ర్యాలీ
కార్పొరేట్ మద్దతు ఉన్న మీడియా ఈ సమస్యను అణిచివేస్తోందని, కానీ షా వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. డిసెంబర్ 26 - 27 తేదీల్లో కర్ణాటకలోని బెలగావిలో మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన 100వ వార్షికోత్సవ వేడుకలను వేణుగోపాల్ ప్రకటించారు.
బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఎత్తిచూపేందుకు డిసెంబర్ 26న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, డిసెంబర్ 27న 'జై భీమ్, జై సంవిధాన్' ర్యాలీ నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ తన నిరసన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర స్థాయి ర్యాలీలు, గ్రామ సభలను కలిగి ఉన్న నెల రోజుల ప్రచారాన్ని కూడా ప్రారంభించనుంది.
షా వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మౌనంగా ఉన్నారని, బీజేపీని ఎదుర్కోవడానికి భయపడుతున్నారని వేణుగోపాల్ విమర్శించారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
'ఎన్నికల పారదర్శకత'
ఎన్నికల కమిషన్‌ను బీజేపీ పక్షపాత సంస్థగా మార్చిందని వేణుగోపాల్ ఆరోపించారు. ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేసే కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆ స్థానంలో కేంద్ర మంత్రిని నియమించడాన్ని ఆయన విమర్శించారు.
"బీజేపీ న్యాయబద్ధతను కోరుకుంటే, ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక ప్రక్రియ నుంచి ఎందుకు మినహాయించారు?" హర్యానా, మహారాష్ట్రలో ఓటరు జాబితాలను అందించడంలో పారదర్శకత కొరవడిందని వేణుగోపాల్ ఆరోపించారు.ఎన్నికల పారదర్శకత కోసం కాంగ్రెస్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వేణుగోపాల్ తెలిపారు.



Tags:    

Similar News