New check-in policy | ఓయో లాడ్జిల్లో పెళ్లి కాని జంటలకు ‘‘నో ఎంట్రీ’’
ఇకపై ఓయో (OYO) లాడ్జిల్లో పెళ్లి కాని జంటలకు నో ఎంట్రీ బోర్డు పెట్టనున్నారు. అలాగే 18 సంవత్సరాలు పూర్తయినట్లు ఆధార్, లేదా ఓటర్ కార్డు చూపితేనే రూం ఇస్తారు.;
ఓయో(OYO)తో జతకట్టిన లాడ్జిల్లో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. పెళ్లి కాని జంటలకు గదులు ఇవ్వకూడదని ఓయో యజమాన్యం కండీషన్ పెట్టింది. 18 సంవత్సరాలు పైబడిన వారికే గదులు అద్దెకు ఇవ్వాలని, అది కూడా ఆధార్, లేదా ఓటర్ కార్డు చూపితేనే ఇవ్వాలన్న నిబంధన తీసుకొచ్చారు. మీరట్‌లో ఓయోతో జతకట్టిన హోటళ్లకు ఈ మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని ఓయో ఆదేశించింది. మీరట్‌లో పౌర సమాజ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యజమాన్యం పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాలను త్వరలో అన్ని నగరాల్లో వర్తింపజేయనున్నారు.
ఓయో ఉత్తర భారత ప్రాంత ప్రతినిధి పవాస్ శర్మ పీటీఐతో మాట్లాడుతూ.. "సురక్షిత, బాధ్యతాయుత అతిథ్య సేవలను అందించేందుకు ఓయో నిరంతరం కృషి చేస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూనే పౌర సమాజ నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాం. బుకింగ్‌లను ప్రోత్సహించడం, వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మాకు ముఖ్యం. అందుకే కొత్త నిబంధన తీసుకొచ్చాం, " అని చెప్పారు.
ఏమిటీ "OYO"
ఓయోను 2013లో రితేష్ అగర్వాల్ స్థాపించారు. OYO అనేది ఒక బ్రాండ్ పేరు మాత్రమే. "On Your Own" అనే పదం నుంచి స్ఫూర్తి పొందింది. ప్రయాణికులు తమ స్వంత నిబంధనల ప్రకారం ప్రయాణించాలనే ఆలోచనను ఇది ప్రతిబింబిస్తుంది. ఓయో ప్రారంభంలో "ఒరవేల్ స్టేస్" అనే పేరుతో ప్రారంభమైంది. తర్వాత దాన్ని ఓయోగా మార్చారు. ఓయోతో జతకట్టిన చాలా హోటళ్లు అతిథ్య సేవలనందిస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో భారీగా బుకింగ్..
దేశంలోనే అత్యధికంగా ఓయో యాప్ ద్వారా గదులు బుక్ చేసుకుంటున్న జాబితాలో తెలంగాణ (Telangana) రాష్ట్రం కూడా ఉంది. హైదరాబాద్ (Hyderabab) వేగంగా అభివృద్ధి చెందుతుండడం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, పలు రకాల పనుల కోసం ప్రపంచ దేశాల నుంచి సిటీకి వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. హోటల్‌లో స్టే చేయాలన్న ఆలోచన వచ్చినపుడు ఓయో యాప్ ద్వారా గదులను బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఓయో యజమాన్యం భారీ స్థాయిలో ప్రచారం చేయడం కూడా ఇందుకు కారణం కావొచ్చు.
రాజ్యాంగంలోని ఆ హక్కుతో..
ఓయో గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా యువతీ, యువకులు రహస్యంగా ఓయో గదులను బుక్ చేసుకుంటున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలను ఓయో యజమాన్యం ఖండిస్తూనే ఉంది. తాము అన్ని రకాల చట్టపర చర్యలూ తీసుకుంటున్నట్లు సమర్థించుకుంది. ‘‘18 ఏళ్లు దాటిన వారు పెళ్లి కాకపోయినా రూమ్ బుక్ చేసుకునే హక్కు ఇండియాలో ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఈ హక్కును కల్పిస్తోంది. ఈ రూల్స్ తాము పాటిస్తున్నామని’’ ఓయో గతంలో పేర్కొంది.
ఇకపై ఐడీ కార్డు చూపాల్సిందే..
ఇకపై ఓయో యాజమాన్యం నిబంధనలను కఠినతరం చేసింది. గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో లాడ్జిలకు వెళ్లే జంటలు తప్పనిసరిగా తమ ఐడీ కార్డులను చూపించాల్సి ఉంటుంది. అంటే ఆధార్ (Aadhar Card), ఓటర్ కార్డు (Voter Card) లాంటివి. తద్వారా వారి వయసు చెక్ చేస్తారు. 18 ఏళ్లు దాటిన వారికే రూమ్స్ ఇస్తారు.