నయాబ్ సింగ్ సైనీ అనే నేను.. అటు దత్తాత్రేయ ఇటు చంద్రబాబు..

హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ కొద్ది సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Update: 2024-10-17 09:24 GMT

హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ కొద్ది సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా రాష్ట్రానికి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సైనీతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు అనిల్ విజ్, క్రిషన్ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్, మహిపాల్ ధండా, విపుల్ గోయెల్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.

దేవాలయంలో ప్రార్థనలు..

ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు జిల్లా కేంద్రం పంచకులలోని మానస దేవి ఆలయంలో ప్రార్థనలు చేశారు సైనీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “డబుల్ ఇంజన్ సర్కారు విధానాలపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన హర్యానా ప్రజలకు నా ధన్యవాదాలు. ప్రధాని మోదీ నాయకత్వంలో రానున్న రోజుల్లో హర్యానాను శరవేగంగా అభివృద్ధి చేస్తాం’’ అని వార్తా సంస్థ ANI తో అన్నారు.

అతిథుల్లో ఏపీ నుంచి సీఎం చంద్రబాబు..

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పంచకులలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వీరితో పాటు ఎన్‌డీఏ భాగస్వామ్యులు అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా విచ్చేశారు.

మూడోసారి అధికారంలోకి..

అక్టోబరు 5న జరిగిన హర్యానా ఎన్నికలలో 90 మంది సభ్యుల అసెంబ్లీలో 48 స్థానాలను గెలుచుకుని మూడవసారి BJP అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కు 37 సీట్లు దక్కాయి. అంతకుముందు రోజు (బుధవారం) పంచకులలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా సైనీని (54) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బీజేపీ నమ్మకాన్ని నిజం చేసిన సైనీ..

మార్చిలో హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ఓబీసీ నేత సైనీ నియమితులయ్యారు. కురుక్షేత్ర జిల్లాలోని లాడ్వా అసెంబ్లీ స్థానంలో ఆయన 16,054 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఖట్టర్ తొమ్మిదిన్నరేళ్ల పదవీకాలంలో రైతుల సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల నుంచి పార్టీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో.. మార్చిలో సైనీని హర్యానా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను భిన్నంగా సైనీ అధికారంలోకి రావడంతో బీజేపీ రాష్ట్రంలో హ్యట్రిక్ కొట్టింది.

వేడుకపై స్టే ఇవ్వని సుప్రీంకోర్టు..

ఇదిలావుండగా హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తీవ్రంగా పరిగణించింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయకుండా ఎలా అడ్డుకోగలం అని సీజేఐ ప్రశ్నించారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌పై జరిమానా విధించవచ్చని పేర్కొంది. 

Tags:    

Similar News