మోదీ చరిష్మా, ఓబీసీ ఓట్లు హర్యానాలో బీజేపీని గెలిపిస్తాయా?

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ముందున్న వ్యూహాలేమిటి? హ్యట్రిక్ కొడుతుందా? అనేది ఆసక్తిగా మారింది..

Update: 2024-09-24 07:44 GMT

ఢిల్లీలో వరుసగా కేంద్రం మూడు సార్లు అధికారంలోకి రావడంలో హర్యానా కీలక భూమిక పోషించింది. అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ హ్యట్రిక్ కొడుతుందా? అనేది ఆసక్తిగా మారింది. గెలుపే లక్ష్యంగా పార్టీ ఎన్నికల వ్యూహాన్ని రచించింది. రెండు వ్యూహాల్లో మొదటిది ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) ఓటర్లను ఆకర్షించడం, రెండోది ఎన్నికల్లో గెలవడానికి ప్రధాని మోడీ చరిష్మాపై ఆధారపడటం.

మోదీకి ఇప్పటికీ ఆదరణ ఉంది కానీ...

ప్రధాని మోదీపై హర్యానా ప్రజలకు ఆదరణ ఉంది. కాని రాష్ట్ర నాయకత్వంపైనే అది కరువైందని హతిన్ నియోజకవర్గంలోని పాండ్రి గ్రామానికి చెందిన 40 ఏళ్ల రైతు రతన్ సింగ్ దేశ్వాల్ పేర్కొన్నారు.

“ప్రధాని మోదీ దేశానికి అత్యుత్తమ నాయకుడు. ఆయన నాయకత్వంతో మాకు ఎలాంటి సమస్యలు లేవు. మా అసంతృప్తికి కారణం హర్యానాలోని బీజేపీ నేతలే. వారు మాకు అండగా నిలబడలేదు. అయితే ఈ ఎన్నికలు ప్రధానిని ఎన్నుకోవడం కాదు. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం. కాబట్టి, మేం దాని ప్రకారం ఓటు వేస్తాం” అని దేశ్వాల్ చెప్పారు.

OBCలు vs జాట్‌లు..

నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా హర్యానాలో బీజేపీకి పదేళ్లలో తొలిసారిగా సొంత మెజారిటీ రాలేదు. ఓబీసీ నేత నయాబ్‌ సింగ్‌ సైనీని ముఖ్యమంత్రిగా నియమించి, జాట్‌ సామాజికవర్గం ప్రాబల్యం లేని 60 అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించింది.

అధికార వ్యతిరేకతను మోదీ ఓడించగలరా?

2014లో కూడా మోదీకి ఉన్న ప్రజాదరణ కారణంగా హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. బీజేపీ తొలుత కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక, ఆ తర్వాత ఏడాదిలో హర్యానాలో ఏర్పాటు చేసింది. 2019లో హర్యానాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అధికార వ్యతిరేక సెంటిమెంట్‌ను ఎదుర్కొంటోంది. ML ఖట్టర్ స్థానంలో సైనీని ముఖ్యమంత్రిగా నియమించాలని కేంద్ర నాయకత్వం మార్చిలో నిర్ణయించినప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

అది చాలా తక్కువ సమయం..

సైనీ పనితీరును అంచనా వేయడానికి ఆరు నెలలు సమయం చాలా తక్కువని బిజెపి సీనియర్ నాయకుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు హర్జిత్ సింగ్ గ్రేవాల్ ఫెడరల్‌తో అన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు నిరంతరాయంగా అధికారంలో ఉన్నప్పుడు అధికార వ్యతిరేకత ఉంటుందన్న విషయాన్ని మేం కొట్టిపారేయలేం. హర్యానాలో సైనీకి మంచి గుర్తింపు ఉంది. పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు మంత్రులను కలుపుకుని పోతున్నారు. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవలసి వచ్చినప్పుడు, అన్ని సమస్యలను కేవలం ఆరు నెలల్లో పరిష్కరించలేం” అని గ్రేవాల్ ఎత్తి చూపారు.

తిరుగుబాటుదారులు - అంతర్గత పోరు..

హర్యానాలో రైతుల నిరసన, రెస్లర్ల ఆందోళన, అగ్నిపథ్ పథక గురించి బీజేపీ ఇప్పటికే వ్యతిరేకత ఎదుర్కొంటుండగా.. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కని వారి వల్ల పార్టీలో అంతర్గత పోరు తలెత్తింది. కనీసం 19 మంది తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు బిజెపికి వ్యతిరేకంగా పోటీ చేయకూడదని లేదా ప్రచారం చేయకూడదని వారిని ఒప్పించేందుకు సైనీ, ఇతర పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాజీవ్ జైన్, రామ్ బిలాస్ శర్మ వంటి కొందరు నాయకులు బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదని నిర్ణయం తీసుకున్నా అంతర్గత పోరు సమస్యగానే కొనసాగుతోంది.

సీఎం సీటుపై గొడవ..

సీఎం పీఠానికి కూడా పోటీ నెలకొంది. అయితే సైనీ నేతృత్వంలోనే ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. బీజేపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆయన్నే ముఖ్యమంత్రిగా పరిగణించాల్సి ఉంటుందని మరో సీనియర్ నేత అనిల్ విజ్ పేర్కొన్నారు. విజ్ ఒక్కడే కాదు. బీజేపీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాశ్ ధంకర్ సహా పలువురు సీనియర్ నేతలు కూడా ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నారు.

పోటీ రెండు పార్టీల మధ్యే..

కాంగ్రెస్, బిజెపి - ఈ రెండు పార్టీలు కూడా అంతర్గత పోరు ఎదుర్కొంటున్నాయి. రెండు పార్టీ్ల్లోనూ రెబల్స్ ఉన్నారు. అయితే పోరు మాత్రం రెండు పార్టీల మధ్యే ఉంటుందని, రెబల్స్ మధ్య కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

"కొందరు స్వతంత్ర అభ్యర్థులు హర్యానా ఎన్నికలలో గెలువవచ్చు. కానీ నిజమైన పోటీ కాంగ్రెస్‌, బిజెపి మధ్య ఉంటుంది. దాదాపు 30 అసెంబ్లీ స్థానాల్లో జాట్ కమ్యూనిటీ బలంగా ఉంది. మిగిలిన 60 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోంది’’ అని డీఏవీ కాలేజీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ బలరామ్ శర్మ చెప్పారు.

వ్యాపారుల ఓట్లు ఎటువైపు?

ఇప్పటికే రైతులు, మల్లయోధులు, వారి కుటుంబసభ్యులు, అభిమానులు బిజెపికి ఓటు వేయారని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యాపారుల వల్ల కూడా పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

"మేము హర్యానా ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించాం. ధరల పెరుగుదల, అవినీతిని అరికట్టడంతో ప్రభుత్వం విఫలమైంది. ఈ రెండు రోజువారీ సమస్యలు. మేము వ్యాపారవేత్తలం. మన పని పూర్తి చేయడానికి కొంత డబ్బు చెల్లించాలని మాకు తెలుసు. కానీ ఈ చిన్న చిన్న అవినీతి ఇప్పుడు చాలా రెట్లు పెరిగింది” అని ఘరౌండా హోల్‌సేల్ మార్కెట్‌లో హోల్‌సేల్ ధాన్యం డీలర్ సురేష్ మిట్టల్ అన్నారు.

UPS vs OPS..

కొత్తగా ఏర్పాటు చేసిన ఏకీకృత పెన్షన్ పథకం (UPS) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని (OPS) తిరిగి తీసుకురావాలని కూడా బీజేపీ యోచిస్తోంది.

“UPS బాగుంది. అయితే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు చాలా మంది గ్రూప్ 3 ఉద్యోగులు OPSని తిరిగి తేవాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకుంటుందని మేము భావించాం. కానీ ఏమీ జరగలేదు.’’ అని కర్నాల్‌లోని 30 ఏళ్ల గ్రూప్ 3 ఉద్యోగి అనిల్ కుమార్ పేర్కొన్నారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5 న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు 8వ తేదీ జరగనుంది.

Tags:    

Similar News