Maharashtra| మహాయుతి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ
మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులేతో సహా 39 మంది ఎమ్మెల్యేలు కొత్తగా కేబినెట్‌లోకి ప్రవేశించారు.;
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఆదివారం జరిగింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులేతో సహా 39 మంది ఎమ్మెల్యేలు కేబినెట్‌లోకి ప్రవేశించారు.
డిసెంబర్ 16న రాష్ట్ర శాసనసభలో వారం రోజుల పాటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సమావేశాలకు ఒకరోజు ముందు నాగ్‌పూర్‌లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఇకపోతే బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన (షిండే) మధ్య వివాదానికి దారితీసిన హోమ్ పోర్ట్‌ఫోలియోను మాత్రం సీఎం ఫడ్నవీస్ వద్దే ఉంది.
ప్రమాణం చేసిన వారిలో బీజేపీ నేతలు ఆశిష్ షెలార్, గణేష్ నాయక్, మంగళ్ ప్రభాత్ లోధా, పంకజా ముండే, గిరీష్ మహాజన్, రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రకాంత్ పాటిల్, శివేంద్రసింగ్ భోసలే, జయకుమార్ గోరే, అతుల్ సేవ్, అశోక్ ఉయికే ఉన్నారు. శివసేన (షిండే)వర్గం నుంచి శంభురాజ్ దేశాయ్, దాదాజీ దగదు భూసే, సంజయ్ రాథోడ్, ఉదయ్ సమంత్, గులాబ్రావ్ పాటిల్ ప్రమాణస్వీకారం చేశారు. NCP నేతలు అదితి తట్కరే, ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, మాణిక్రావ్ కొకటే మరియు నరహరి జిర్వాల్ కూడా ప్రమాణం చేశారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 288 స్థానాలకు గానూ 230 స్థానాల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది. బీజేపీ 132 సీట్లు గెలుచుకోగా, షిండే సేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. డిసెంబరు 5న దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, మాజీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఆయన డిప్యూటీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.