మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి విజయం.. BJP హవా
రెండు దశల్లో ముగిసిన మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు..
మహారాష్ట్ర(Maharasthra) స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) మహాయుతి కూటమి ఆధిక్యాన్ని చాటింది. ఆదివారం (డిసెంబర్ 21) 246 మునిసిపల్ కౌన్సిల్‌లు, 42 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) దూసుకుపోతోంది. పోలింగ్ జరిగిన 6,859 స్థానాల్లో కాషాయ పార్టీ 3,100 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..దాని మిత్రపక్షాలు శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) వరుసగా 600, 200 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఇక ప్రతిపక్ష శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్ పవార్), కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు వరుసగా 145, 122, 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తం మీద మహాయుతి కూటమి 241 స్థానిక సంస్థల్లో ఆధిక్యంలో ఉండగా..ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి 52 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది.
అతిపెద్ద పార్టీగా బీజేపీ..
ఈ ఎన్నికలలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 246 మునిసిపల్ కౌన్సిళ్లలో 133 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా మహాయుతి కూటమి పట్టు బిగించింది. మెజారిటీ మున్సిపల్ కౌన్సిలర్ సీట్లను కాషాయ పార్టీ గెలుచుకుంది. ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన మహాయుతి కూటమి ఆధిపత్యం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగుతోంది.
మహారాష్ట్ర వ్యవసాయ సంక్షోభాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మహాయుతి(Mahayuti) కూటమికి ప్రతిపక్షం గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించినట్లుగా జరగలేదు. ప్రచారంలో పార్టీల మధ్య సమన్వయ లోపమే ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకుల మాట.