ముంబైలో కొనసాగుతోన్న జరంగే నిరాహార దీక్ష..

బహిరంగంగా స్నానం చేస్తూ కనిపించిన నిరసనకారులు..;

Update: 2025-08-31 10:22 GMT

మరాఠా (Maratha) సమాజానికి రిజర్వేషన్ల కల్పించాలని ముంబై(Mumbai)లో మరాఠా హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే(Jarange) చేపట్టిన నిరాహార దీక్ష (hunger strike)ఆదివారం (ఆగస్టు 31) మూడో రోజుకు చేరుకుంది. 29వ తేదీ నుంచి దీక్ష చేపట్టిన ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వేల సంఖ్యలో ఆజాద్ మైదాన్‌‌కు చేరుకుంటున్నారు. శనివారం నిరసన వేదిక, చుట్టుపక్కల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జరంగే మద్దతుదారులు శుక్రవారం రాత్రి రోడ్డుపైనే ఆహారాన్ని వండుకుంటున్న దృశ్యాలు, శనివారం ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.


బహిరంగ స్నానాలు..

వర్షాలు తగ్గడంతో ఆందోళనకారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) బయట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేశారు. కొంతమంది BMC ట్యాంకర్లలోని నీళ్లతో బహిరంగగానే స్నానం చేశారు. కొంతమంది BMC భవనం సమీపంలోని ఫౌంటెన్‌లో స్నానం చేస్తూ కనిపించారు.


వేల సంఖ్యలో మద్దతుదారులు..

శుక్రవారం దాదాపు 45వేల మంది నిరసనకారులు దక్షిణ ముంబైకి చేరుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 30వేల మంది రాత్రి అక్కడే ఉండిపోయారు. మరాఠ్వాడలోని 8 జిల్లాల నుంచి - దాదాపు 8వేల వాహనాల్లో వచ్చారని పోలీసులు అంచనా వేస్తు్న్నారు.


జరంగేను కలిసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి.

రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహిస్తున్న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సందీప్ షిండే జరంగేను కలిశారు. అయితే ఆయనను తనతో చర్చలు జరపడానికి పంపడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను విమర్శించారు. కాగా రాజ్యాంగపరంగా సమస్యకు పరిష్కారం కనుగొనే పనిలో ఉన్నామని ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) చెబుతున్నారు. ఇదే సందర్భంలో రిజర్వేషన్లపై పరిమితిని పెంచడానికి రాజ్యాంగ సవరణ అవసరమని ఎన్‌సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు.


‘ఇదే మా చివరి పోరాటం..’

మరాఠాలకు 10 శాతం కోటా కల్పించాలని జరంగే గతంలో 7సార్లు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఇది తమ "చివరి పోరాటం" అని పేర్కొన్నారు.

మరాఠా కమ్యూనిటీ సభ్యులకు కున్బి కుల ధృవీకరణ పత్రాలను జారీ చేసే అంశాన్ని పరిశీలించేందుకు అప్పటి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం సెప్టెంబర్ 2023లో ఏర్పాటు చేసిన కమిటీకి జస్టిస్ షిండే నాయకత్వం వహిస్తున్నారు. 

Tags:    

Similar News