జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

భారత ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం (ఆగస్టు 16) జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.

Update: 2024-08-16 11:08 GMT

భారత ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం (ఆగస్టు 16) జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25 , అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. హర్యానాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న జరగనుంది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ఇంకా ప్రకటించలేదు.

జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో..

జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు గాను సెప్టెంబర్‌ 18 (24 స్థానాలకు), 25న (26 స్థానాలకు), అక్టోబర్‌ 1న (40 స్థానాలకు) పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 4న ఫలితాలు వెలువడతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. 



హర్యానాలో అక్టోబర్‌ 1న పోలింగ్‌ ..

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను అక్టోబర్‌ 1 న పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 



హర్యానా, మహారాష్ట్ర శాసనసభల పదవీకాలం వరుసగా నవంబర్ 3, నవంబర్ 26న ముగుస్తాయి. జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు సెప్టెంబర్ 30 వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇటీవల జమ్మూ కాశ్మీర్, హర్యానాలో పర్యటించిన ఈసీ ఇంకా మహారాష్ట్రను సందర్శించలేదు.

Tags:    

Similar News