‘నా ముఖాన్ని తుడుచుకున్నా..అంతే..
సోషల్ మీడియాలో వైరలయిన వీడియోపై DMK మంత్రి మాటలకు కౌంటర్ ఇచ్చిన AIADMK చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ అనంతరం అన్నాడీఎంకే(AIADMK) చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి(Edappadi K Palaniswami) తన కారులో ముఖం దాచుకుని వెళ్తున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో నిన్న( సెప్టెంబర్ 17న) తెగ వైరలయిన విషయం తెలిసిందే. దీనిపై DMK మంత్రి ఎస్. రేగుపతి ఈపీఎస్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు. "ఎవరైనా తన ముఖాన్ని దాచుకోడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి అవమానానికి గురయినపుడు, లేదంటే తప్పు చేసినపుడు.." అని మీడియాతో అన్నారు.
రేగుపతి మాటలకు సేలంలోని ఓమలూరులో విలేఖరులలో సమావేశంలో ఈపీఎస్ గురువారం (సెప్టెంబర్ 18న) కౌంటర్ ఇచ్చారు.
'నా ముఖాన్ని తుడుచుకున్నా..'
"నా ఢిల్లీ పర్యటన, హోంమంత్రితో సమావేశం గురించి నేను మీడియాకు బహిరంగంగా తెలియజేశా. షాతో సమావేశం అధికారికంగా, పారదర్శకంగా జరిగింది. నా ముఖాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. కారు ఎక్కేటప్పుడు నేను నా ముఖాన్ని తుడుచుకున్నాను. దీన్ని డీఎంకే కావాలని రాజకీయ చేస్తుంది” అని చెప్పారు ఈపీఎస్.
'స్టాలిన్‌ది విభిన్న మనస్తత్వం..'
కాంగ్రెస్‌తో డీఎంకే పొత్తుపై ఈపీఎస్ మాట్లాడుతూ.. గతంలో డీఎంకేకు హాని తలపెట్టిన పార్టీని స్టాలిన్ ఇప్పుడు సమర్థించడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ నాయకులు 117 స్థానాల్లో పోటీ చేసి అధికారంలో భాగం కావాలని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిది విభిన్న మనస్తత్వం. ప్రధాని మోదీ చెన్నై వచ్చినపుడు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు నల్ల జెండా చూపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెల్ల జెండాతో ఆయనకు స్వాగతం పలికారు. ఇదీ సీఎం మనస్తత్వం" అని అన్నారు ఈపీఎస్.