ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు తీవ్రంగా గాయపడ్డ బాలిక
భువనేశ్వర్ ఎయిమ్స్ ఐసీయూలో మేజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు..;
ఒడిశా (Odisha) రాష్ట్రం పూరి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు 15 ఏళ్ల బాలికకు నిప్పంటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం కోసం విమానంలో ఢిల్లీ(Delhi)కి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలిక తన స్నేహితురాలి ఇంటి నుండి తిరిగి వస్తుండగా.. బయాబర్ గ్రామ సమీపంలోని భార్గబీ నది ఒడ్డున శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ‘‘70 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలిక ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది.12 మంది వైద్యుల బృందం ఆమెను పరీక్షిస్తోంది. ఆమె ఆరోగ్యం కాస్త నిలకడగా ఉంది. బహుశా ప్రత్యేక విమానంలో ఆమెను మరో రెండున్నర గంటల్లో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తాం’’ అని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ బర్న్ సెంటర్ విభాగాధిపతి సంజయ్ గిరి తెలిపారు.
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శనివారం వెల్లడించారు. బాలికకు మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి విమానంలో తరలించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారని మాఝీ తెలిపారు.
వాంగ్మూలం రికార్డ్..
బాధితురాలు శనివారం కాస్త మాట్లాడడంతో పోలీసులు భువనేశ్వర్ ఎయిమ్స్ ఐసియుకు చేరుకుని మేజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దర్యాప్తుకు ఆమె వాంగ్మూలం చాలా కీలకమని ఒక పోలీసుల అధికారి చెప్పారు.
బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు బాలికను అడ్డగించి, బలవంతంగా నది ఒడ్డుకు తీసుకెళ్లి, ఆమెపై మండే స్వభావం ఉన్న ద్రవాన్ని పోసి నిప్పంటించారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలికకు నిప్పంటించిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. స్థానికులు మంటలను ఆర్పి తరువాత ఆమెను పిపిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆమెను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బలంగా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. బాధితురాలు 8వ తరగతి చదువుతుండగా చదువు మధ్యలో మానేసిందని, ఆమె తండ్రి మోటార్ గ్యారేజీలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.