పీపీపీ విధానంపై ముందుకే..టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయండి
పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీలేదు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By : Vijayakumar Garika
Update: 2025-12-24 14:25 GMT
పేదలకు నాణ్యమైన మెడికల్ విద్యను, వైద్యాన్ని అందించే విషయంలో ఎక్కడా రాజీ పడేది, వెనక్కి తగ్గేది ఉండదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రస్తావనకు వచ్చింది. దేశ వ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని.. పేద వర్గాలకు నాణ్యమైన, కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో పీపీపీ విధానంలో ముందుకువెళ్లాలని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
పీపీపీలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్
సమీక్ష సందర్భంగా పీపీపీ విధానంలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం, మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వ సూచనలను, మార్గదర్శకాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పీపీపీ ప్రాజెక్టుల అమలును ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం, ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా పలు విధానపరమైన ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో అమలులో ఉన్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద... సామాజిక–ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పీపీపీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందించే ఆర్థిక చేయూతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని కేంద్రం సూచించిందని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా వైద్య రంగంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇచ్చే 60 శాతం ఆర్థిక మద్దతులో చెరో 30 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. వీజీఎఫ్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆసుపత్రులు, వైద్య కళాశాలు నిర్మించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని చెప్పారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం పీపీపీ విధానాన్ని ప్రోత్సాహిస్తోందని అధికారులు వివరించారు. దీని ద్వారా వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వంటి కీలక ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అభిప్రాయ పడినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి టెండర్ల దాఖలు
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీలను ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన కార్యాచరణతో పనిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏపీలో పీపీపీ విధానంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వీజీఎఫ్ సహ ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తొలి విడతగా ఆదోని, మదనపల్లి, పులివెందుల, మార్కాపురం మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అధికారులు సీఎంకు వివరించారు. నాలుగు మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానంలో నిర్మించి, నిర్వహించేలా సెప్టెంబరు 18న ప్రభుత్వం టెండర్లు పిలిచిందని... అక్టోబర్ 6వ తేదీన నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయని అధికారులు తెలిపారు.
క్షేత్ర స్థాయిలో బిడ్డర్ల పర్యటన
అయితే కొందరు బిడ్డర్లు ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను అంచనా వేసుకునేందుకు కొంత సమయం కావాలని కోరారన్న విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. కొందరు రెండవ ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించాలని కూడా అభ్యర్థించారని... బిడ్డర్ల అభ్యర్థన మేరకు అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులకు సైట్ విజిట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం అక్టోబర్ 23న నిర్వహించిన రెండవ ప్రీ-బిడ్ సమావేశంలో కూడా బిడ్డర్లు పాల్గొన్నారని... రెండు దశల ప్రీ-బిడ్ సమావేశాల అనంతరం నాలుగు సంస్థలు మరింత సమాచారం కోరాయని అధికారులు వివరించారు. ప్రతి ప్రాజెక్టుకు గరిష్టంగా 50 ఎకరాల కేటాయింపు, డిజైన్ల వివరాలు వంటి అంశాలపై చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని... NMC నిబంధనలు అనుసరించి, భూమిని సమర్థవంతంగా వినియోగించుకునేలా డిజైన్లను రూపొందించుకునే స్వేచ్ఛ ఇవ్వాలని, కన్సార్టియం సభ్యుల సంఖ్యను 2 నుండి 3కి పెంచాలని కూడా బిడ్డర్లు కోరితే అంగీకరించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇదే సందర్భంలో ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఓ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. ముందుకు వచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకుని కాలేజ్ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను సూచించారు. అలాగే మిగిలిన కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు... బిడ్డర్లతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సంజీవని ప్రాజెక్టుపై సమీక్ష
కుప్పంలో పైలెట్ గా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు అమలు పైనా సీఎం అధికారులతో చర్చించారు. త్వరలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేసేలా అధికారులు ఎలాంటి కసరత్తు చేస్తున్నారని సీఎం ఆరా తీశారు. కుప్పంలో ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ... వాటికి పరిష్కారం చూపేలా చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులు ఇచ్చేలా రూపొందించిన ఈ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.