’ఇండికేటర్లను సిద్ధం చేయండి‘
స్వర్ణాంధ్ర-2047, 10 సూత్రాల అమలుపై నోడల్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతీ ప్రభుత్వ శాఖ ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన కోసం రూపొందించిన పది సూత్రాలను పది మిషన్లుగా నిర్దేశించుకుని పనిచేయాలని సీఎం సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా శాఖల నోడల్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. మిషన్ ఫ్రేమ్ వర్క్ రూపకల్పన, ఆయా ప్రభుత్వ శాఖలు మెరుగైన పనితీరు కోసం ముఖ్యమైన ఇండికేటర్లను గుర్తించి వాటికి అనుగుణంగా పనిచేయాలని సీఎం సూచించారు. జీరో పావర్టీ మిషన్లో భాగంగా పీ4 విధానాన్ని ముందుకు తీసుకెళ్లటంతో పాటు వాటి అమలును విజన్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ కుటుంబమూ సాధికారిత సాధించాలని అలాగే వ్యక్తులకు ఆర్ధిక భద్రత కల్పించటమే ఈ మిషన్ ముఖ్య లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో ఉన్న దాదాపు 30 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఎంత ప్రయోజనం కలిగిందో అంచనా వేయాలని సూచించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఓ విధానాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాలు ఉద్యోగాల కల్పన అనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు.