ఢిల్లీవాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన AAP చీఫ్ కేజ్రీవాల్
హస్తనలో సొంత ఇంటి యజమానికి ఆప్ సర్కారు ఉచితంగా నీళ్లు, విద్యుత్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టెనెంట్‌కు ఈ పథకాలు వర్తింపజేస్తామని కేజ్రీవాల్ చెప్పారు.;
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శనివారం మరో హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే అద్దెదారులకు కూడా ఫ్రీ కరెంట్, వాటర్ పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఓ మీడియా సమావేశంలో అద్దెకారుల సమస్యల గురించి ప్రస్తావించారు. "నేను ఎక్కడికెళ్లినా మంచి పాఠశాలల్లో మా పిల్లలు చదువుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. అయితే మాకు కూడా ఫ్రీగా కరెంటు, నీళ్లు ఇవ్వాలని అద్దెదారులు కోరుతున్నారు," అని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని ఆయన హామీ చెప్పారు. "ఎన్నికల తర్వాత పూర్వాంచల్ ప్రాంతానికి చెందినవారితో పాటు టినెంట్లకు కూడా ఈ పథకాలను వర్తింపజేస్తాం," అని పేర్కొన్నారు.
ఆప్ ఇదివరకు ఇచ్చిన హామీలు..
- మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.1,000 నుంచి రూ.2,100కి పెంపు
- 'సంజీవని యోజన' కింద 60 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య భీమా
- ‘పూజారి గ్రంథి సమ్మాన్ యోజన’ కింద పూజారులకు గౌరవ వేతనంగా నెలకు రూ. 18 వేలు.
- ఆటోరిక్షా డ్రైవర్లకు రూ.15 లక్షల ప్రమాద బీమా, వారి కూతుర్ల పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం, ఏడాదికి రెండుసార్లు యూనిఫాం భత్యం
- అధికంగా వచ్చిన వాటర్ బిల్లుల మాఫీ
- రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్(ఆర్‌డబ్ల్యూఏ) ద్వారా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకానికి నిధులు మంజూరు
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఫలితాలు 8న వెల్లడించనున్నారు.