టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు దాతలు సహకారం అందిస్తున్నారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కూడా ఈ ఏడాది ప్రారంభం నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. టీటీడీ ధార్మిక కార్మక్రమాలతో పాటు విద్యా సంస్థలు, ఆస్పత్రులు కూడా నిర్వహిస్తోంది. ఆస్పత్రులకు కూడా దాతలు విరాళాలు అందించడం ద్వారా పేదలకు మెరుగైన సేవలు అందించడానికి సహకారం అందిస్తున్నారు.
టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడుకు రూ.75 లక్షల డీడీ అందిస్తున్న దాతలు
ఆ కోవలోనే సోమవారం టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు 95 లక్షల రూపాయలు విరాళాలు అందాయి. అందులో ప్రధానంగా అన్నదానం, ప్రాణదానం, బర్డ్ ట్రస్టులకు టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడుకు డీడీల విరాళాలు అందించారు. హైదరాబాద్ లోని ఏడీఓ ఫౌండేషన్ సోమవారం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు 75 లక్షల రూపాయలు అందించారు. అన్నదానం ట్రస్టు, బర్డ్ ట్రస్టుకు పది లక్షల రూపాయల వంతులన దాతలు తిరుమలలో వేర్వేరుగా అందించారు.
కీలక ఆస్పత్రులు
పేద రోగులకు తక్కువ ఫీజులకే కార్పొరేట్ వైద్య సేవలు అందించడంలో శ్రీవెంకటేశ్వ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - స్విమ్స్ ఆస్పత్రి (Sri Venkateswara Institute of Medical Sciences SVIMS) తోపాటు శ్రీ బాలాజీ వికలాంగుల, శస్ర్త చికిత్స, పునరావాస కేందరం బర్డ్ (Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled BIRRD) ఆస్పత్రి ద్వారా వికలాంగులకు ఊతం ఇవ్వడంలోనే కాకుండా కీళ్ల మార్పిడి, కృత్రిమ అవయవాల అమర్చడం, శస్త్ర చికిత్సలు అందించడంలో దేశీయంగా గుర్తింపు సాధించింది. టీటీడీ ఆధీనంలో నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రుల్లో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
విరాళాల వెల్లువ
తిరుమలలో మాతృశ్రీ తరగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో యాత్రికులకు రోజంతా నిరంతరాయంగా అన్నప్రసాదాలు వడ్డించడంలో దాతలు కీలకపాత్ర పోషిస్తున్నారు. విరాళాల వడ్డీతోనే ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది.
దీనికి గుంటూరుకు చెందిన సింహాద్రి వెంకట శివ ప్రసాద్ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు.
హైదరాబాద్ కు చెందిన ఏడీవో ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ సోమవారం టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు విరాళంగా అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీ అందజేశారు. వారికి అంతకుముందు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు, రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ,ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. పేద రోగుల కోసం టీటీడీ నిర్వహిస్తున్న సంస్థలకు కానుకలు సమర్పించిన దాతలను చైర్మన్ నాయుడు అభినందించారు.
బెంగుళూరుకు చెందిన ఎం.రాకేశ్ రెడ్డి కూడా వేరుగా టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీ అందజేశారు.