అయ్యో 'జోగీ'.. ఇలా ఇరుక్కున్నావేంటీ స్వామీ!
నేను బీసీని కావడం వల్లే ఈ ఆరోపణ అంటున్న జోగి
By : The Federal
Update: 2025-10-13 15:21 GMT
నకిలీ మద్యం తయారీ కేసు కూడా వైసీపీ వైపే మళ్లుతోందా అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3,450 కోట్ల రూపాయల లిక్కర్ స్కాం విచారణ సాగుతోంది. ఈనేపథ్యంలో నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జనార్ధన్ రావు- నకిలీ మద్యం పాపమంతా వైసీపీ పాలనలోనే మొదలైందని పోలీసు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు జనార్ధన్ రావు చెప్పారని ప్రచారం ఇవాళ విస్తృతంగా సాగుతోంది. అయితే ఇందులో ఎంత నిజముందనేది అధికారికంగా ఎవ్వరూ నిర్దారించలేదు. అయితే ఈ ఆరోపణలను మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఖండించారు.
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం నకిలీ మద్యం వ్యాపారం వైసీపీ పాలనలో మొదలైంది. ఇందుకు ఆద్యుడు మాజీ మంత్రి జోగి రమేష్. విస్తృతంగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం జనార్ధన్ రావు ఇలా చెప్పినట్టు ఉంది...
‘2024 ఏప్రిల్‌లో జోగి రమేశ్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు సహకరించాలని కోరారు. నకిలీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నాం. రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించాం. తంబళ్లపల్లి అయితే చంద్రబాబుపై బురద జల్లోచ్చని చెప్పారు. ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు’ అన్నట్టు ప్రచారం సాగుతోంది.
‘నన్ను కావాలనే ఆఫ్రికాలోని నా మిత్రుడి వద్దకు పంపారు. జోగి రమేశ్ తన మనుషులతో లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. టీడీపీ వారిని చంద్రబాబు సస్పెండ్ చేయడంతో ప్లాన్ మార్చారు. ఇబ్రహీంపట్నంలోనూ సరకు తెచ్చి పెట్టాలన్నారు. ఇబ్రహీంపట్నం గిడ్డంగిలో ముందురోజే సరకు తెచ్చిపెట్టారు. మళ్లీ లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు. పథకం ప్రకారం చంద్రబాబు సర్కారుకు చెడ్డపేరు వచ్చిందని’ జనార్దన్ చెప్పారని సమాచారం. "ఈ ప్లాన్ ప్రకారమే అనుకున్నట్టే అంతా జరిగింది.. నువ్వు ఆఫ్రికా నుంచి రావొద్దని చెప్పారు. అంతా నేను చూసుకుంటా.. బెయిలిప్పిస్తా" అని జోగి రమేష్ హామీ ఇచ్చారని, ఆ తర్వాత హ్యాండిచ్చారని కూడా జనార్దన్ చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది.
జోగి రమేష్ ఏమన్నారంటే...
తనపై వచ్చిన ఆరోపణలపై మండిపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను నమ్మిన వారందరి మేలు చేశానే తప్ప ఏనాడూ కీడు చేయలేదన్నారు. మనసాక్షిగా తాను తప్పు చేయను, చేయలేదు అని సోమవారం సాయంత్రం మీడియాతో చెప్పారు.
దీనిపై చంద్రబాబు, ఆయన కుటుంబం, తాను, తన కుటుంబంతో తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధం కావాలన్నారు. కేవలం తనపై బురద జల్లుతున్నారని, ఈ కల్తీ మద్యం కేసును సిబిఐ తో విచారణ జరిపించి నిజాలు బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. సిట్ కాదు సిబిఐతో విచారణ చేయించి ఈ కల్తీ మద్యం వెనుక ఉన్న అసలు నిందితులను అరెస్టు చేయాలి కోరారు. తాను బలహీన వర్గాలకు చెందిన వాడిని కాబట్టే ఇలా రిమాండ్ లో ఉన్న వ్యక్తితో వీడియో బయట పెట్టించారంటూ జోగి రమేష్ ఆరోపించారు.