కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ మృతి; రేపు అంత్యక్రియలు
1935 అక్టోబర్ 12న జన్మించిన పాటిల్..లాతూరు నుంచి లోక్‌సభకు ఏడుసార్లు ఎన్నికయ్యారు. పంజాబ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.
కాంగ్రెస్(Congress) సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్(Shivraj Patil) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన స్వస్థలం మహారాష్ట్ర(Maharashtra)లోని లాతూర్‌లో తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల పాటిల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబసభ్యలు తెలిపారు. రేపు (డిసెంబర్ 13) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శివరాజ్ పాటిల్‌కు కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన ఉన్నారు. కోడలు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై లాతూర్ నగరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ దేశ్‌ముఖ్‌పై పోటీ చేసి ఓడిపోయారు.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణం..
1935 అక్టోబర్ 12న జన్మించిన పాటిల్.. 1966, 1970 మధ్య లాతూర్ మునిసిపాలిటీ అధ్యక్షుడిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. తరువాత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977, 1979 మధ్య మహారాష్ట్ర అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్, స్పీకర్‌గా ఉన్నారు. ఆ తరువాత లాతూర్ లోక్‌సభ స్థానం నుంచి ఏడుసార్లు గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రూపతై పాటిల్ నీలంగేకర్ చేతిలో ఓడిపోయారు. పాటిల్ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. కాంగ్రెస్ హయంలో రక్షణ, వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడి తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలం పాటు పంజాబ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.