మహిళల చుట్టూ JD(U), RJD, జన్ సూరజ్ పార్టీల వ్యూహాలు..

మహిళా కేంద్రీకృత పథకాలపై ఎందుకంత ప్రచారం?.. వారి ఓట్లు పార్టీలను అధికారంలోకి తెస్తాయా? ఏ పార్టీ ఎంత ఇస్తుంది?

Update: 2025-09-19 11:22 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో ఎన్నికల హడావుడి మొదలైంది. నవంబర్‌లో (Assembly polls) ఎలక్షన్లు జరిగే అవకాశం ఉండడంతో పార్టీలు గెలుపు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓటర్లను ముఖ్యంగా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీలతో ఊదరగొడుతున్నాయి. ఉచితాలపై వాగ్దానాలివ్వడమే కాదు దరఖాస్తు ఫారాలను పూరిస్తున్నాయి.

మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా.. రెండు ప్రధాన కూటములు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) JD(U), మిత్రపక్షాలయిన BJP, LJP(R), HAM పార్టీ కార్యకర్తలు, ఊరూరా తిరుగుతున్నారు. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’కు అప్లై చేసుకోవాలని దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నారు.

మరోవైపు RJD, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తాము అధికారంలోకి వస్తే ‘మై-బెహన్ మాన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగానే మహిళల నుంచి ఇప్పటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఉచితాల రేసులో ఉన్న మరొ కొత్త పార్టీ జాన్ సూరజ్. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఈ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ‘పరివార్ లాభ్ కార్డు’ పేరిట ఆ పార్టీ శ్రేణులు కూడా ఇళ్లిళ్లు తిరగడం మొదలపెట్టాయి.

ఆశ్చర్యం ఏమిటంటే.. ఎన్డీఏ, ఆర్జేడీ ప్రజాకర్షక వాగ్దానాలను ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన పీకే.. ఇప్పుడు బీహార్‌లో ఎన్నికలకు ముందు తాను కూడా ఉచితాలపై ప్రచారం చేయడం.


‘మహిళా రోజ్‌గార్ యోజన..’

మహిళల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి ఈ మధ్య సీఎం నితీష్ కుమార్ ‘‘మహిళా రోజ్‌గార్ యోజన’’ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఆర్థిక సాయం అందుతుంది. ఎన్నికలకు ముందే మొదటి విడత రూ. 10వేలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 2.77 కోట్ల మంది మహిళలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి ఇప్పటికే కోటి మందికి పైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఆరు నెలల తర్వాత అదనంగా రూ. 2 లక్షలు జమ చేస్తారు. చిరు వ్యాపారం ప్రారంభించుకోవడమే ఈ పథకం లక్ష్యం. సెప్టెంబర్ 20 తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారు, ఆమె భర్త ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకపోతే ఈ పథకానికి అర్హులు.


దరఖాస్తుల వెల్లువ..

ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మహిళలు నెట్ సెంటర్ల ముందు క్యూ కడుతున్నారు.

"గత మూడు రోజుల్లోనే డజన్ల కొద్దీ మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి నా దుకాణానికి వచ్చారు. ‘జీవికా’ స్వయం సహాయక బృందంలో ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అక్కడ వారి పేరు ఉన్నట్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరగవచ్చు’’ అని సైబర్ కేఫ్ నిర్వాహకుడు రాహుల్ కుమార్ పేర్కొన్నారు.


"గేమ్ ఛేంజర్"

బీహార్ ఎన్నికలలో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ గేమ్ ఛేంజర్ అవుతుందని ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు మహిళలకు రూ. 10వేలు నగదు ప్రోత్సాహకం ప్రకటించడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కులం, తరగతి, సమాజానికి అతీతంగా మహిళలు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందడానికి ఆసక్తిగా కనిపిస్తున్నారు. అయితే వారు నితీష్‌కు విజయాన్ని కట్టబెడతారా? లేదా అన్నది ఎన్నికల తర్వాత బయటపడుతుంది.’’ అని మరో రాజకీయ విశ్లేషకుడు పేర్కొన్నారు. వాస్తవానికి మహిళా కేంద్రీకృత సంక్షేమ పథకాలు తొలుత తమిళనాడులో ప్రారంభమై తరువాత ఏపీ, కర్ణాటక నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించాయని ఆయన చెప్పుకొచ్చారు.


‘మై-బెహన్ మాన్ యోజన’..

ఇదే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా మహిళా ఓట్లను రాబట్టుకునేందుకు ‘మై-బెహన్ మాన్ యోజన’తో ముందుకొచ్చాయి. ఈ పథకం కింద పేద, నిరుపేద కుటుంబాల మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెబుతున్నారు.

ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్(Tejashwi Yadav) అమలుకాని వాగ్దానాలతో మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నాడని బీజేపీ, జేడీ(యూ) నాయకులు గతంలో ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అవే పార్టీలు ఆ పని చేస్తుండడం గమనార్హం.

కాగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్ మాట్లాడుతూ.. "‘మై-బెహన్ మాన్ యోజన’ మా ఉమ్మడి పథకం, ఎన్డీఏ జుమ్లాల మాదిరిగా కాకుండా.. మేం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లో గానే బీహార్‌లో అమలు చేస్తాం" అని చెప్పారు.


‘పరివార్ లాభ్’..

ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) జాన్ సూరజ్ పార్టీ ‘పరివార్ లాభ్’ కార్డుతో ఎన్నికల బరిలోకి దిగుతుంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలకు రూ. 20,000 ఇస్తామని హామీ ఇచ్చింది. పార్టీ ఇప్పటికే 50 లక్షల దరఖాస్తులను సేకరించిందని సమాచారం.


ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

ఈ నెలఖార్లో ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అయితే NDA అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకా ప్రకటించలేదు. ఇక ప్రతిపక్ష కూటమి తరుపున తేజశ్విని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది.


మహిళల ఓట్లు ఎందుకు అంత ముఖ్యం?

బీహార్‌లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. వారి ఓట్లే విజయావకాశాలను శాసిస్తున్నారు. అందుకే పార్టీలు వారికే ప్రాధాన్యం ఇస్తూ పథకాలు ప్రవేశపెడుతున్నాయి.

2010 నుంచి జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే ఎక్కువగా ఉందని ఎన్నికల కమిషన్ డేటా చూపిస్తుంది. 2020లో, 59.7% మంది మహిళలు ఓటు వేయగా, 54.7% మంది పురుషులు ఓటు వేశారు. 2015లో ఈ అంతరం 60.5% నుండి 53.3% వరకు ఉంది. 2010లో 59.6% నుంచి 54.9% వరకు ఉంది. “50–70 లక్షలకు పైగా పురుషులు పనుల కోసం బీహార్‌ను వదిలి వెళ్లిపోతారు. పోలింగ్ రోజును మిస్ అవుతురు. కాని ఇంట్లో మహిళలు తమ ఓటు హక్కును ఉపయోగిస్తారు. ఇది సహజంగానే మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచుతుంది" అని ఒక రాజకీయ పరిశీలకుడు పేర్కొన్నారు.

మొత్తంమీద మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. దీన్ని పార్టీలన్నీ ఫాలో అవుతుండడం గమనార్హం. 

Tags:    

Similar News