ఢిల్లీలో గాలి కాలుష్యం: పెరుగుతున్న కంటి జబ్బులు

దీపావళి తర్వాత ఢిల్లీలో పెరిగిన గాలికాలుష్యం కారణంగా కంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిందని అంటున్న కంటివైద్యులు..

Update: 2025-11-04 14:05 GMT
Click the Play button to listen to article

ఢిల్లీ(Delhi)లో అధిక గాలి కాలుష్యం(Air Pollution) కారణంగా కంటి అలెర్జీలు, కళ్లు పొడిబారడం, కళ్ల నుంచి నీరు కారడం లాంటి సమస్యలు పెరిగాయని.. ఈ తరహా సమస్యలతో పెద్దలు, పిల్లలు ఎక్కువగా బాధపడుతున్నారని కంటి వైద్యులు చెబుతున్నారు. దీపావళి తర్వాత గాలి నాణ్యత బాగా పడిపోవడమే అందుకు కారణమంటున్నారు.


పెరిగిన కేసులు..

ఢిల్లీ ఐ సెంటర్, సర్ గంగా రామ్ హాస్పిటల్‌ కంటివైద్య నిపుణుడు డాక్టర్ ఇకెడా లాల్ మాట్లాడుతూ.. "ఏటా దీపావళి తర్వాత కంటి సమస్యలతో ఎక్కువ మంది రావడం మేం గమనించాం. కళ్ల దురద, కళ్ల ఎర్రగా మారడం, కళ్లు పొడిబారడం లాంటి సమస్యలతో మా దగ్గరకు వచ్చే వారి సంఖ్య దాదాపు 50-60 శాతం పెరిగింది. గాలి కాలుష్యం కారణంగా దీర్ఘకాలిక కంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు, డెలివరీ ఏజెంట్లు, స్కూలు పిల్లలు, బయట ఎక్కువసేపు గడిపే వారు జాగ్రత్తగా ఉండాలి.


జాగ్రత్తలు తప్పనిసరి..

ఎయిమ్స్‌లోని ఆర్‌పి సెంటర్‌లో ఆప్తాల్మాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ సిన్హా మాట్లాడుతూ.. గాలిలోని నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ వంటి కాలుష్య కారకాలు వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. వీటితో వచ్చే వారి సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లెన్స్, కార్నియా మధ్య చిక్కుకున్న చిన్న కణాలు కళ్ల మంటను మరింత ఎక్కువ చేస్తాయి. కాంటాక్ట్ లెన్స్ వాడే వారు లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ దగ్గర ఉంచుకోవాలి. తరచుగా శుభ్రమైన నీటితో కళ్లను కడుక్కోవాలి. బయటకు వెళ్లేటపుడు ప్రొటెక్టివ్ కళ్లజోడు ధరించాలి. పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించడం ఉత్తమం’’ అని చెప్పారు. 

Tags:    

Similar News