జాతీయ రహదారులు మృత్యు మార్గాలు ఎందుకవుతున్నాయి,

తప్పు రోడ్లదా, డ్రైవర్లదా. అధ్యయనానికి 7న కర్నూలుకు వస్తున్న NHAI చైర్మన్

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-04 13:46 GMT

 కర్నూలు, ఆ తరువాత వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో జాతీయ రహదారుల నిర్మాణం, భద్రత ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఈ నెల ఏడో తేదీ National highways authority of India NHAi చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కర్నూలుకు రానున్నట్లు సమాచారం అందింది. బస్సు దగ్ధమైన ఘటన ప్రదేశాన్ని ఎన్. హెచ్.ఏ.ఐ చైర్మన్ యాదవ్ పరిశీలించిన తరువాత, రహదారి నిర్మాణ తీరును కూడా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.

కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద ఈ నెల 24వ తేదీ వేకువజామున వి.కావేరీ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనాలు మృత్యు శకటాలుగా మారినట్టు పరిస్థితి మారింది. కర్నూలు వద్ద ప్రయివేటు బస్సు దగ్ధం ఘటన తరువాత వరుసగా జరిగిన ప్రమాదాలు కూడా జాతీయ రహదారుల శాఖ (NHAI) స్పందించేలా చేసింది.
"ఎన్.హెచ్ 44 లో కర్నూలు నుంచి బెంగళూరు మార్గంలో అనంతపురం వరకు 15 సంవత్సరాల కిందట ఈ రహదారి నిర్మాణం జరిగింది. డిజైన్లలో ఎక్కడ ఫెయిలింగ్ లేదు" అని జాతీయ రహదారుల శాఖ అనంతపురం పీఐయూ (Project implementation unit PIU NHAI) మేనేజర్ దండి మురళీకృష్ణ స్పష్టం చేశారు.

దేశంలో జాతీయ రహదారి అత్యంత పొడవైనది. జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసే కారిడార్. 13 రాష్ట్రాలను కలిపే ఈ రహదారి తెలంగాణ నుంచి ఏపీలో కర్నూలు వద్ద చీలి, కర్ణాటక మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి వరకు సాగుతుంది.
ఏపీలోని కర్నూలు నుంచి అనంతపురం మీదుగా బెంగళూరు వరకు 260 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. అత్యంత పొడవైన ఈ మార్గంలో  ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువే అని స్పష్టం చేసింది. అధిక ప్రమాదాలకు ఆస్కారం ఉన్న  39 బ్లాక్ స్పాట్లను గుర్తించారు.

కర్నూలు బస్సు దగ్ధమైన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ శాఖల తోపాటు జాతీయ రహదారుల శాఖాధికారులు కూడా పరిశీలించారు. ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలాన్ని సందర్శించడమే కాదు. దర్యాప్తు సాగిస్తూనే ఉంది.జాతీయ రహదారి 44 పై జరిగిన ఘటన నేపథ్యంలో ఎన్.హెచ్.ఏ.ఐ కన్సల్టెంట్ మురళీకృష్ణ తోపాటు కర్నూలు జిల్లా పోలీస్, రవాణా శాఖ అధికారులు, మృతదేహాల పంచనామా నిర్వహించడానికి ఫోర్ ఎంసెట్ విభాగం కూడా దర్యాప్తు చేసింది. వి. కావేరి బస్సు దగ్ధం ఘటనలు 19 మంది మృతి చెందడానికి దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేశారు. అందులో రవాణా నిషేధిత గ్యాస్ సిలిండర్ తోపాటు వందలాది సెల్ ఫోన్లు ఉండడం కూడా ప్రమాదానికి కారకంగా గుర్తించారు.
ప్రాథమికంగా నిర్ధారణ
ప్రయివేటు బస్సు దగ్ధం ఘటనపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విచారణలో తేలిన అంశాలు.
"వి.కావేరి ట్రావెల్స్ బస్సు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. జాతీయ రహదారిపై ఇది అత్యంత ప్రమాదకరం. బస్సు డ్రైవర్ రోడ్డుపై పడి ఉన్న బైక్ను గుర్తించడంలో వైఫల్యం. ఆ బైక్ను కొన్ని మీటర్లు ఈడ్చుకొని వెళ్లడం వల్ల జరిగిన రాపిడిలో నిప్పులు చెలరేగడం ఇంధనం లీక్ కావడంతో మంటలు చెలరేగాయి" అని ప్రస్తావించారు.
ఈ ఘటనపై మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ministry of road transport and highways Government of India MoRTH) బృందం కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బస్సులో చేసిన నిర్మాణ మార్పులు, అత్యవసర ద్వారం, పరికరాలు లేకపోవడం కూడా ప్రధానంగా ప్రస్తావించారు.
మితిమీరిన వేగం..
ఈ ఘటన దర్యాప్తు చేసిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనంతపురం పిఐయు కన్సల్టెంట్ ఎం. భరత్ భూషణ్ కూడా ఉన్నతాధికారులకు నివేదిక అందించారు.
"జాతీయ రహదారిపై నిర్ణీత వేగానికి మించి వీ.కావేరి ట్రావెల్స్ బస్సు నడపడంలో జాగ్రత్తలు పాటించలేదు" అని తన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ప్రస్తావించిన అంశాల్లో ప్రమాదాన్ని గుర్తించడంలో డ్రైవర్ మిరియాల కృష్ణయ్య సకాలంలో స్పందించలేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణం అని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ఇంకా ఏమని ప్రస్తావించారంటే.
జాతీయ రహదారిపై పడి ఉన్న మోటార్ బైక్ ను సకాలంలో గుర్తించలేకపోవడం, మితిమీరిన వేగంతో ఉన్న వాహనాన్ని నియంత్రించడంలో ప్రొఫెషనల్ డ్రైవర్ గా శ్రద్ధ లేదు.‌ రోడ్డుపై బైక్ పడిపోవడం, ఆ తర్వాత బస్సు వచ్చి ఢీకొనడానికి మధ్య 12 నిమిషాల వ్యవధి ఉందని, సంఘటన జరిగిన వెంటనే స్పందించే అవకాశం ఎన్హెచ్ఏఐ కి లేదని, రోడ్డు నిర్మాణంలో కూడా ఏమాత్రం వ్యత్యాసాలు లేకుండా ప్రామాణికాలకు అనుగుణంగానే నిర్మాణం జరిగింది" అని ఎన్ హెచ్ ఎ ఐ అనంతపురం భరత్ భూషణ్ ప్రస్తావించారు. మిగతావి షరా మామాలు అంశాలు వివరించారు. అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ప్రయాణికులు ఎక్కిన డోర్లు మూసుకుపోవడం వంటి కారణాలు ఎత్తిచూపారు.
కర్నూలు వద్ద బస్సు దగ్ధమైన ఘటనను జాతీయ రహదారి 44 అనంతపురం పీఐయూ ప్రాజెక్టు డైరెక్టర్ తరుణ్ కుమార్ కూడా సందర్శించారు. దీనిపై మిగతా ప్రభుత్వ శాఖల అధికారులలో కలిసి దర్యాప్తులో పాల్గొన్నారు.
"జాతీయ రహదారి 44 మలుపులకు ఆస్కారం లేదు. ప్రధానంగా ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు కిలోమీటర్ల దూరం వరకు ప్రశాంతంగా ప్రయాణించడానికి అనువుగానే నిర్మాణం జరిగింది. ఇందులో మా శాఖ పొరబాట్లు లేవు" అని అనంతపురం ప్రాజెక్టు డెరెక్టర్ తరుణ్ కుమార్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు. జాతీయ రహదారి నంబర్ 44లో 20 బ్లాక్ స్పాట్లు ( Black spots ) ఉన్నాయి. అక్కడ పటిష్ట చర్యలు కూడా తీసుకున్నామని ఆయన వివరించారు. కొత్తగా మరో ఏడు బ్లాక్ స్పాట్లు గుర్తించామని ఆయన వివరించారు.
బ్లాక్ స్పాట్లు అంటే..
ఐదేళ్ల కాలంలో జరిగిన ప్రమాదాల లెక్కల ఆధారంగా జాతీయ రహదారుల మీద ఒక ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ అని గుర్తిస్తారు. కర్నూలు జాతీయ రహదారి ( NH 44)లోని కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం సమీపంలో ఆ శాఖ అధికారులు బ్లాక్ స్పాట్ గానే గుర్తించినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చిన్నటేకూరు క్రాస్ రోడ్డు ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ (Black Spot ID : AP-(02) 149, Chain Link Kilometers. 222+000 To 222_500) గుర్తించారు.
ఎన్ హెచ్ 44లో కర్నూలు, అనంతపురం జిల్లాల మధ్య ఉన్న 260 కిలోమీటర్ల పరిధిలో 2023 నాటికి 39 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. 2011 నుంచి 14 మధ్య కాలంలో 29 ఉంటే, 2015 నుంచి 2018 మధ్య 24, 2019 నుంచి 2022 నాటికి ఆ బ్లాక్ స్పాట్ల సంఖ్య 36 ఆ తరువాత 39కి పెరగడం అంటే, ప్రమాదాల సంఖ్య కూడా పెరగడమే కారణంగా జాతీయ రహదారుల శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది.
జాతీయ రహదారి 44 పై ఉన్న కర్నూలు నుంచి బెంగళూరు వరకు ప్రతి సంవత్సరం సగటున 1,500 ప్రమాాదాల్లో 650 మందికి పైగానే మరణిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  ఇదేమార్గంలో ఎగువ ప్రాంతం హర్యానాలో 715 మంది, ఢిల్లీ సెక్షన్ లో63 మంది మరణించారు. కిలోమీటరుకు ముగ్గురు మరణించినట్లు ఓ నివేదిక స్పష్టం చేసింది. ఇండియన్ రోడ్ అసిస్మెంట్ ప్రోగ్రాం ( iRAP ) స్టార్ రేటింగ్ పద్ధతిని ఉపయోగించడం ద్వారా బ్లాక్ స్పాట్లపై చేసిన అధ్యయనంలో రహాదారుల నిర్మాణం, భద్రతా చర్యలకు పెద్దమొత్తం ఖర్చు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.
ప్రమాదాల నివారణకు
బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన మార్గంలో రెండు రకాల జాగ్రత్తలు ఉంటాయి. అందులో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ పద్ధతిలో ప్రమాద నివారణ చర్యలకు నిర్మాణాలు చేస్తామని అనంతపురం పీఐయూ మేనేజర్ మురళీకృష్ణ స్పష్టం చేశారు.
"సర్వీసు రోడ్ల నిర్మాణం, అండర్ పాస్ లు, ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడం, రహదారి పక్కన చక్కటి వాతావరణం కల్పించడం ద్వారా సురక్షితమైన ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి నిధుల కొరత కూడా ఉండదు" అని మురళీకృష్ణ స్పష్టం చేశారు.
నగదు రహిత చికిత్స
కర్నూలు బస్సు దగ్ధం సంఘటనలో కూడా 15 నిమిషాలకు సమాచారం అందిన వెంటనే జాతీయ రహదారుల శాఖ అంబులెన్స్ లు చేరాయి. చెప్పారు. 44 జాతీయ రహదారిలో మూడు టోల్ ప్లాజాల వద్ద తమ అంబులెన్స్ లు సిద్ధంగా ఉంటాయి. ఈ వాహనాల్లో తరలించే బాధితులకు నగదు రహిత చికిత్సకు బీమా వర్తిస్తుంది. ఎన్.హెచ్.ఏ.ఐ జాతీయ బీమా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వారే టోల్ ప్లాజాల వద్ద అంబులెన్స్ లు సిద్ధంగా ఉంచారు.
దర్యాప్తు సాగుతోంది...
కర్నూలు బస్సు దగ్ధంపై దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని ఉలిందకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ధనుంజయ చెప్పారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలతో పాటు కొన్ని నివేదికలు తయారు చేయాల్సి ఉందన్నారు.
" ఈ ఘటనలో బస్సు యజమాని ఏ2గా ఉన్నారు.ఇంకా కొందరిని విచారణ చేయాల్సి ఉంది" అని ఎస్ఐ ధనుంజయ చెప్పారు. ఈ కేసును కర్నూలు డీఎస్పీ వెంకటరామయ్య పర్యవేక్షణలోనే దర్యాప్తు జరుగుతోందని ఆయన వివరించారు.
హైదరాబాదు వద్ద బస్సు ప్రమాద సంఘటనలో 19 మరణించడం, బాపట్ల వద్ద కూడా సోమవారం జరిగిన సంఘటనలు జాతీయ రహదారులపై ప్రయాణం భయానకంగా మారింది. ఇదిలావుంటే, అనంతపురం జిల్లా పుట్టపర్తికి సమీపంలో సోమవారం వేకువజామున కూడా జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటన ప్రయాణికులను మరింత ఉలికిపాటుకు గురిచేసింది. సరిగా 12 సంవత్సరాల కిందట కూడా మహబూబ్ నగర్ వద్ద జబ్బార్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో 51మంది సజీవదహనమైన ఘటన అనేక మంది కుటుంబాల్లో విషాదం నింపింది.
కర్నూలు బస్సు దగ్ధం ఘటనకు కొనసాగింపుగా జరిగిన పరిణామాలపై జాతీయ రహదారుల స్థితి చర్చకు వచ్చింది. ఈ పరిణామాల్లో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఎన్.హెచ్.ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కర్నూలుకు రానున్నారని సమాచారం. ఆయన వచ్చాక ఏమి తెలుస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది.
Tags:    

Similar News