కోల్ కత రేప్, మర్డర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు
తీర్పు వెల్లడించిన సీల్ధా కోర్టు, బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం;
By : Praveen Chepyala
Update: 2025-01-20 10:17 GMT
ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిని అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కు సీల్ధా కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ. 17 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నిందితుడికి రూ. 50వేలు జరిమానా విధించింది.
గత ఏడాది ఆగష్టు 9న ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ గా ఉన్న ‘అభయ’ను నిందితుడు సంజయ్ రాయ్ పాశవికంగా అత్యాచారం చేసి గొంతు కోసి హతమార్చాడు. ఈ కేసును స్థానిక పోలీసులు సరిగా డీల్ చేయకపోవడం, బెంగాల్ ప్రభుత్వం పై ఆరోపణలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
తరువాత సుప్రీంకోర్టు కేసును సుమోటోగా తీసుకుని, సీబీఐకి బదిలీ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి కేసులో ప్రాథమిక వివరాలను సేకరించింది. కొన్ని రోజులకే నిందితుడిని విచారించి అరెస్ట్ చేసింది.
తాను నిర్దోషిని వాదించిన సంజయ్ రాయ్..
కోర్టులో తాను నిర్దోషినని, కేసులో అక్రమంగా ఇరికించారని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పుకున్నాడు. ‘‘నన్ను ఈ కేసులో ఇరికించారు. నేనే తప్పు చేయలేదు. అయినప్పటికీ దోషిగా నిలబెట్టారు. చాలా విషయాలు నాశనం చేశారు. నేను అత్యాచారం చేసి ఉంటే నా రుద్రాక్ష మాల విరిగిపోయేది’’ అని కోర్టు హాలులో చెప్పారు.
అయితే నా ముందున్న సాక్ష్యాల ఆధారంగా న్యాయం చేస్తానని న్యాయమూర్తి బదులిచ్చారు. మూడు గంటల పాటు మీ వాదనలు విన్నారు. ప్రాసిక్యూషన్ మీ మీద అభియోగాలు నిరూపించింది. ఇప్పుడు శిక్షపై మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నానని జడ్జి చెప్పారు.
నేరారోపణ
సీల్థాలోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి అనిర్భన్ దాస్ శనివారం రాయ్ ను దోషిగా నిర్ధారించారు. తీర్పు విచారించే ముందు రాయ్ ను స్వయంగా విచారిస్తానని చెప్పారు. కనిష్ట శిక్షగా జీవిత ఖైదు.. గరిష్టంగా మరణ శిక్ష విధిస్తాకావచ్చని జడ్జి చెప్పారు. భారతీయ న్యాయసంహిత సెక్షన్ 64, 66, 103(1) కింద నిందితుడిని న్యాయమూర్తి దోషిగా ప్రకటించారు.
ఉరిశిక్ష విధించాలి: సీబీఐ
సివిక్ వాలంటీర్ గా పనిచేసిన సంజయ్ రాయ్ తరుచుగా ఆర్జీకర్ ఆస్ప్రత్రికి వచ్చే దోషికి కఠిన శిక్ష విధించాలని సీబీఐ లాయర్ అభ్యర్థించారు. ‘‘ ఈకేసు అరుదైన కేసులలో అరుదైనది’’ అని మరణశిక్ష విధించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉదహరించారు. ‘‘ సమాజంపై ప్రజల విశ్వాసం ఉంచడానికి అత్యధిక శిక్ష విధించాలని ప్రార్థిస్తున్నాం’’ అని సీబీఐ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
కేసు తీర్పురాగానే కోర్టు ప్రాంగణంతో పాటు ఆర్జీకర్ ఆస్పత్రి ప్రాంగణంలో భారీగా పోలీసులు మోహరించారు. రాయ్ ఒక్కడే ఈ నేరం చేసి ఉండకపోవచ్చని, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉండవచ్చని అక్కడ గుమిగూడిన ప్రజలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
విచారణ, తీర్పు పై తల్లిదండ్రుల అసంతృప్తి
సీబీఐ విచారణ, కోర్టు తీర్పు, పరిహారం పై తల్లిదండ్రుల అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము పరిహారం కోసం పోరాడలేదని, తమకు న్యాయం జరగాలని అన్నారు. అలాగే నేరంలో చాలామందికి ప్రమేయం ఉందని మిగిలిన వారిని పట్టుకోవడంలో సీబీఐ విఫలం అయిందని ఆరోపించారు. భవిష్యత్ లో సమాజంలో జరిగే నేరాలను ఆపాలంటే ఇలాంటి నేరస్థులకు జీవించే హక్కులేదని అన్నారు.