కేంద్రం పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు
జూన్ లో ఆరుగురిని అక్రమ బంగ్లాదేశీయులంటూ డీపోర్టు చేసిన కేంద్రం, వారు భారతీయులని కలకత్తా హైకోర్టు ఆదేశాలు
By : Praveen Chepyala
Update: 2025-10-30 07:35 GMT
జూన్ లో బంగ్లా జాతీయులంటూ దేశం నుంచి బహిష్కరించిన పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాకు చెందిన ఆరుగురిని తిరిగి భారత్ కు తీసుకురావాలంటూ వారి బంధువులు కలకత్తా హైకోర్టులో కేసు దాఖలు చేశారు.
ఇంతకుముందు ఇదే కేసును విచారించిన న్యాయస్థానం వీరిని ఒక నెలలోపు భారత్ కు తీసుకురావాలని ఆదేశించిందని, అయిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనందున ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసు వచ్చే నెల ఆరున న్యాయమూర్తులు తపబ్రత చక్రవర్తి, రిటో బ్రోటో కుమార్ ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నట్లు కోర్టు పత్రాలు తెలిపాయి. ఇంతకుముందు ఇదే కేసును ఈ ద్విసభ్య ధర్మాసనమే విచారించింది.
సెప్టెంబర్ 26 న దరఖాస్తుదారులు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం, రెండు కుటుంబాలలోని ఆరుగురు సభ్యులు, ముగ్గురు పిల్లలను కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసదారులంటూ గుర్తించడాన్ని పక్కనపెట్టింది. ఇందులో సోనాలి అనే మహిళ తొమ్మిది నెలల గర్భవతి. బంగ్లాదేశ్ అధికారులు కూడా వారిని బహిష్కరించడంతో ప్రస్తుతం ఆమె జైలులో ఉంది. ఈ మహిళతో పాటు మిగిలిన వారిని కూడా బంగ్లా అధికారులు జైలులో పెట్టారు.
వారు భారతీయులు..
సెప్టెంబర్ 30 న బంగ్లాదేశ్ కోర్టు కూడా డీపోర్ట్ అయిన వ్యక్తులు బంగ్లాజాతీయులు కారని నిర్ధారించి, వారిని స్వదేశానికి రప్పించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఢాకాలోని భారత హై కమిషన్ ను కోరింది.
అక్టోబర్ 22న కేంద్ర హోంశాఖ కలకత్తా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. నిర్భంధం, బహిష్కరణ ఢిల్లీలో జరిగిందని అయినప్పటికీ కలకత్త హైకోర్టు కేసును విచారించిందని, దాని అధికార పరిధి ఇక్కడ వర్తించదని కేసు వాదించింది. ఈ విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలన లో ఉంది.
అప్పట్లో కేసును విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ తన ఉత్తర్వూలో అధికారులు బహిష్కరణ ప్రక్రియ చాలా హడావుడిగా నిర్వహించారని, ఢిల్లీకి చెందిన ఎఫ్ఆర్ఆర్ఓ(విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం) బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను స్వదేశానికి రప్పిస్తున్నా ఎంహెచ్ఏ జారీ చేసిన మెమోలో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది.