దుర్గాపూర్ గ్యాంగ్ రేప్: దర్యాప్తు ను ముమ్మరం చేసిన పోలీసులు
నిందితులంతా ఒకే వర్గానికి చెందినవారు, ఆడ పిల్లలు రాత్రులు బయటకు ఎందుకు వస్తారన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
By : Praveen Chepyala
Update: 2025-10-13 11:15 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్గాపూర్ వైద్య విద్యార్థి గ్యాంగ్ రేప్ లో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
కొన్ని నివేదికల ప్రకారం.. ఐదో నిందితుడిని షేక్ సఫికుల్ గా తేలింది. అతను స్థానిక దుర్గాపూర్ నివాసి. అత్యాచారం చేసిన తరువాత బంధువుల ఇంటికి పారిపోయాడు. నాలుగో నిందితుడు షేక్ నసీరుద్దీన్ గా గుర్తించారు. నిందితుడిది బిర్జా అని తేలింది.
అత్యాచారం తరువాత నిందితులకు అతని బైక్ ఇచ్చారు. మొదట నసీరుద్దీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ తరువాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. సఫీకుల్, నసీరుద్దీన్ ఇద్దరిని కూడా దుర్గాపూర్ సబ్ డివిజనల్ కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కస్డడీకి తీసుకునే అవకాశం ఉంది.
ఆదివారం తెల్లవారుజామున మరో ముగ్గురు నిందితులు షేక్ రియాజుద్దీన్, అపు బారుయ్, ఫిర్దౌస్ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేసి పది రోజుల రిమాండ్ కు తరలించారు. ఫిర్దౌస్ స్థానిక ప్రయివేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు.
ప్రధాన నిందితులు అదుపులోనే..
మహిళ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటి వరకూ ఐదుగురిని అరెస్ట్ చేశామని దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) అభిషేక్ గుప్తా జాతీయ మీడియాకు తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని జలేశ్వర్ కు చెందిన 23 ఏళ్ల వైద్య విద్యార్థిని శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి కాలేజ్ క్యాంపస్ నుంచి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదుగురు దుండగులు అతని స్నేహితుడిపై దాడి చేసి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
టీఎంసీ కార్యకర్త..
ఈ సంఘటన రాజకీయంగా బెంగాల్ లో దుమారం రేగింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సుబేందు అధికారి మాట్లాడుతూ.. అరెస్ట్ అయిన నిందితులలో ఒకరు టీఎంసీ కార్యకర్త అని పేర్కొన్నారు.
దీనిపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఎంసీ ప్రతినిధి దేబాన్షు భట్టాచార్య మాట్లాడుతూ.. ‘‘ నిందితుడు టీఎంసీ కార్యకర్త అయినప్పటికీ టీఎంసీ నేరాలను సహించదు. ఈ సంఘటన బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే నిందితులకు దండలు వేసేవారు’’ అని ఎదురుదాడికి దిగారు.
అయితే బాధితురాలు ఒడిశాకు చెందినది కావడంతో అక్కడ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని సీఎం మోహన్ చరణ్ మాఝీ, పశ్చిమ బెంగాల్ సీఎంను కోరారు.
బెంగాల్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
దుర్గాపుర్ గ్యాంగ్ రేప్ పై బెంగాల్ సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రయివేట్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు రాత్రి 12.30 నిమిషాలకు ఎందకు బయటకు వస్తారని, అక్కడ అడవి ఉందని చెప్పడంపై దుమారం రేగింది. అయితే ఈ సంఘటన రాత్రి 8 నుంచి 8.30 నిమిషాలకు సంఘటన జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. మూడు వారాల క్రితం ఒడిశాలోని సముద్ర తీరంలో ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిగిందని, ఒడిశా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుందని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు.
ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సోవన మొహంతి పశ్చిమ బెంగాల్ కు చేరుకుంటారని ఆమె బాధితురాలితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారని, ఆమె తల్లిదండ్రులను కలిసి స్థానిక పోలీసులతో చర్చలు జరుపుతారని భావిస్తున్నారు.