పాండియన్ పైనే ప్రత్యర్ధుల గురి ? ఒడియా ప్రైడ్ తో రాజకీయ తుఫానేనా..
ఒడియాలో నవీన్ పట్నాయక్ వారసుడిగా తమిళ మూలాలు ఉన్న పాండియన్ రంగ ప్రవేశం చేయడంతో ఆయన రాజకీయ ప్రత్యర్థులందరూ ఒడియా ప్రైడ్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
By : Praveen Chepyala
Update: 2024-05-05 06:43 GMT
వి. కార్తికేయన్ పాండియన్.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేయట్లేదు. కానీ ఒడిషాలో గత ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేడీకి కొత్త నాయకుడు. ఒడియా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు అత్యంత సన్నిహితుడు. అయితే రాష్ట్రంలో జరుగుతున్నరాజకీయ మంటలకు ఆయనే కారణం అనే చర్చ జరుగుతోంది. పార్టీలో ఆయనకు ఇప్పటి వరకూ అధికారిక హోదా లేకపోయినప్పటికీ పార్టీని, రాష్ట్రాన్ని ఆయన శాసిస్తున్నాడనేది నిర్వివాద అంశం.
గత సంవత్సరం చివరలో IAS నుంచే వైదొలిగే వరకు పట్నాయక్ కార్యదర్శిగా ఉన్న పాండియన్, ఇప్పుడు బీజేడీ కి స్టార్ క్యాంపెయినర్. అతని పేరు పట్నాయక్ తర్వాత రెండవ స్థానంలో ఉంది. తత్ఫలితంగా, పాండియన్ తన బాస్ తరపున పార్టీ తరఫున నాయకత్వం వహిస్తున్నాడు. నవీన్ ఆరోగ్యం ఈ మధ్య అస్సలు బాగాలేదు.
పట్నాయక్‌కు బదులుగా, పాండియన్ రాష్ట్రమంతటా, ఎక్కువగా హెలికాప్టర్‌లో తిరుగుతూ, రికార్డు స్థాయిలో ఆరవసారి నవీన్ పట్నాయక్ ను పీఠం ఎక్కించేందుకు శ్రమిస్తున్నారు. దాదాపు నాలుగున్నర కోట్లున్న ఒడియా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. రాష్ట్రంలో రాజకీయ తుఫాను సృష్టించే కార్యక్రమాలకు ఆయనే కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాన్-ఒడియా గుర్తింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వరకు అందరూ పాండియన్‌ను ఒడియేతర వ్యక్తిగానే టార్గెట్ చేస్తున్నారు. పాండియన్ జన్మించింది తమిళనాడులో. ఐఏఎస్ సహోద్యోగిని పెళ్లి చేసుకుని భువనేశ్వర్ చేరుకున్నాడు. తమిళ యాసతో ఒడియా మాట్లాడతాడు. కాబట్టి అతను బయటి వ్యక్తి అని ప్రతిపక్షపార్టీలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇదే ముఖ్య అంశంగా మారింది.
"ఒడియా అస్మిత" (ఒడియా ప్రైడ్) ప్రమాదంలో ఉంది" అని ప్రధాని నరేంద్ర మోదీతో సహ ప్రధాన పార్టీలన్నీ ఒడియాలో ఇదే ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు. అన్నింటిది ఒకటే మాట.
పట్నాయక్ రాజకీయ వారసుడిగా పాండియన్ ఇప్పటికే ఒరిస్సా ప్రజలకు చిరపరచితం. పార్టీపై, ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. అదే స్థాయిలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి దాడులు ఎదుర్కొంటున్నాడు.
పశ్చిమ ఒడిశాలోని సంబల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పాండియన్‌ను 'గుమస్తా' (మున్షీ) తప్ప మరేమీ కాదని వర్ణించారు. భువనేశ్వర్‌లోని బీజేపీ ఎంపీ అభ్యర్థి అపరాజిత సారంగి, 2019లో తొలిసారిగా ఎంపీ కాకముందు ఐఏఎస్ గా పనిచేశారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాండియన్‌ను 'బడా బాబు' స్థానంలో నిలబెట్టాలని చూస్తున్న 'సానాబాబు' (జూనియర్ బాబు) అని అభివర్ణించారు. ' బ్యాక్ డోర్ నుంచి అధికారాన్ని చేపట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
ఒడియా ప్రైడ్ ను కాపాడుతున్నారా?
బీజేడీ పుట్టుకే ఒడియా ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం. ఇప్పుడు నాన్ ఒడియన్ ఇక్కడ అధికారాన్ని చేపట్టడానికి వచ్చాడని ప్రచారం చేస్తున్న పార్టీలు ప్రధానంగా పాండియన్ ను విమర్శిస్తున్నాయి. ఇది ఓటర్లలోకి బలంగా తీసుకెళ్తే తమ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని, ఓట్లు, సీట్లు గెలుచుకోవచ్చిన ప్రధాన ప్రత్యర్థుల ఉవాచ. ఇప్పటి వరకు ఒడిషా లో జరిగిన అన్ని ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ అజేయంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనను గద్దె దించే ఆయుధాన్ని తానే ప్రత్యర్థులకు ఇచ్చాడు. ఇక ప్రతిపక్షలు అధికారమే లక్ష్యంగా ప్రజాబాహూళ్యంలో ఎత్తులు వేస్తున్నాయి.
పట్నాయక్ ఇప్పటిదాకా పూర్తిగా పాండియన్ పైనే ఆధారపడి ఉన్నాడు. దీని వెనక ఉన్న కారణాలు తెలియదు కానీ.. ఆయన ఎదుగుదల పార్టీలోని సీనియర్ నేతలకు రుచించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా తానే వేదికపై నిలుచుని ప్రసంగాలు చేయడం, ఆయనకు ఉన్న కాన్వాయ్, ట్రాఫిక్ ను నిలిపివేయడం ఇవన్నీపార్టీలో ఒక రకమైన అసంతృప్తికి కారణమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కీలక సమస్యల వెనకడుగు
పాండియన్‌పైనే ప్రతిపక్షాలు, స్వపక్షం గురిపెట్టడంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పక్కకు పోయినట్లు అయింది. ముఖ్యంగా పెరుగుతున్న నిరుద్యోగం, విద్యా మౌలిక సదుపాయాల్లో లోపాలు, తాగు, సాగు నీటి కష్టాలపై ప్రజల్లో సరిగా చర్చ జరగట్లేదు. బీజేడీ ఇప్పటికే రాష్ట్రంలో తాను చేపట్టిన అనేక మార్పులను ప్రచారం చేసుకుంటోంది. అయితే అధికార డేటా మాత్రం మరో విషయాలను ఎత్తి చూపుతున్నాయి. వందలాది పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ఇంటర్నెట్, కంప్యూటర్, సైన్స్ లేబొరేటరీలు, పైపుల ద్వారా తాగునీరు కూడా లేకుండా పోతోంది. ఒడిశా నుండి ఏటా వేలాది మంది వలసపోతున్నారు. కనీసం ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగాలనైన భర్తీ చేయలేకపోయారు.
కానీ పాండియన్ ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజా సమూహాల్లో ఒంటరిగా ప్రచారం చేస్తూ.. తానే పట్నాయక్ విలువలకు అసలైన వారసుడినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ యంత్రాంగం మొత్తం తనతోనే ఉందని, తానే పార్టీని నడుతున్నానే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఆయనే టార్గెట్ గా ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
దేశంలోని ఇతర అగ్ర నాయకులు మాదిరిగానే ఆయన నిరంతరం ప్రచారంతో తన పేరు జనంలో ఉండేలా చూసుకుంటున్నారు. కానీ ప్రత్యర్థులు ఆయన్ను అకిలెస్ హీల్ గా చూస్తున్నారు. ఒక కాంగ్రెస్ వాది చెప్పినట్లుగా: “నిన్న సంజయ్ గాంధీ ఈరోజు పాండియన్. 1970లలో సంజయ్ ఎంత ప్రచారం చేసినా కాంగ్రెస్ ఓట్లు కోల్పోయింది. పాండియన్ విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఓటర్లు ఈ పోలికతో ఏకీభవిస్తారో లేదో చూడాలి.