లోక్‌సభలో డీఎంకే ఎంపీల నిరసన.. రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్..
“తమిళనాడు సర్కారు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కూడా NEPకి అంగీకరించాయి,” - కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.;
పార్లమెంట్ (Parliament) ఉభయ సభల్లోనూ సోమవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. లోక్‌సభలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇటు రాజ్యసభలో చర్చకు అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశారు.
దిగువ సభలో ప్రధాన్ ఏమన్నారంటే..
“జాతీయ విద్యా విధానం(NEP) ఒప్పంద పత్రంపై సంతకం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం తొలుత అంగీకరించింది. కానీ ఇప్పుడు వైఖరి మార్చుకుంది. డీఎంకే సర్కారు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోంది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి అనేక బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కూడా ఒప్పందంపై సంతకాలు చేశాయి,” అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ గుర్తుచేశారు.
ధర్మేంధ్ర వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను అరగంట పాటు విరామం ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్..
రాజ్యసభలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. అనేక అంశాలపై వారు ఇచ్చిన నోటీసులను స్పీకర్ తిరస్కరించడంతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. “నకిలీ” ఓటర్ ఐడీలు, అమెరికా నుంచి భారతదేశంలో ఓటింగ్ శాతం పెంచడానికి ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలు వాటి నోటీసుల్లో ఉన్నాయి. అయితే కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చారు. నిబంధనలకు లోబడి ఏ సమస్యపైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రూల్ 267 కింద..12 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు సభాపతి హరివంశ్ ప్రకటించారు. తిరస్కరణలపై ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే తన అభిప్రాయాన్ని చెప్పేందుకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు.
చర్చకు ఎవరు ఏం కోరారు?
డీఎంకే నేత తిరుచీ ఎన్. శివ, సీపీఐ సభ్యుడు సంతోష్ కుమార్ పి, ఎమ్‌డీఎంకే నేత వైకో, సీపీఐ నాయకుడు పీ.పి. సునీర్, డీఎంకే సభ్యుడు పీ. విల్సన్ మొదలైన వారు దక్షిణ భారత రాష్ట్రాల్లో జరుగనున్న పునర్విభజన ప్రక్రియపై చర్చకు నోటీసులు ఇచ్చారు.
తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సాకేత్ గోఖలే, సాగరికా ఘోష్, కాంగ్రెస్ నేతలు ప్రమోద్ తివారీ, అజయ్ మాకెన్ రాష్ట్రాల్లో నకిలీ ఓటర్ ఐడీ కార్డులు జారీ విషయంలో ఎన్నికల సంఘం చేసిన తప్పిదాలపై చర్చకు కోరారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోవడం వల్ల చిన్న పెట్టుబడిదారులకు జరిగిన ఆర్థిక నష్టంపై చర్చకు ఆహ్వానించారు.
సమాజ్‌వాదీ పార్టీ నేత రాంజీలాల్ సుమన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన భారతదేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా నిధులు అందజేస్తుందనే వ్యాఖ్యపై చర్చను కోరారు.
సీపీఎం సభ్యుడు వి. శివదాసన్ ఆంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి చర్చించాలని కోరారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రయత్నించనుంది. అయితే వక్ఫ్ బిల్లు, నూతన విద్యా విధానం (NEP), పునర్విభజన, అమెరికా టారిఫ్ అంశాలపై ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలని భావిస్తోంది.
అదే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.