భారత కూటమిని ఐక్యంగా ఉంచేందుకు SIR దోహదపడిందా?

I.N.D.I.A కూటమి నాయకులను ఐక్యంగా ఉంచేందుకు, ఏకతాటిపైకి తీసుకురావడానికి ఖర్గే విందు సాయపడిందా?;

Update: 2025-08-12 09:06 GMT

ఏఐసీసీ(AICC) చీఫ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Kharge) సోమవారం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో విపక్ష ఎంపీలకు ఇచ్చిన విందులో, అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆగస్టు 7న ఇండియా బ్లాక్ నాయకులకు ఇచ్చిన విందులో పెద్దగా రాజకీయ చర్చలు జరిగి ఉండకపోవచ్చు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత గత సంవత్సరకాలంగా కాంగ్రెస్(Congress) తన మద్దతు పార్టీలను ఆకర్షించడానికి పెద్దగా ఏమీ చేయలేదు. ఆ లోపాన్ని సరిదిద్దడానికి ఇప్పుడు ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగమే ఖర్చే ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం. ప్రతిపక్ష నేతలను ఏకతాటిపైకి తీసుకురావడానికి నెలరోజుల్లో ఆయన చేసిన మూడో ప్రయత్నమిది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు.. జూలై 19న భారత బ్లాక్ సీనియర్ నాయకుల వర్చువల్ సమావేశానికి ఖర్గే అధ్యక్షత వహించారు. ఆ తర్వాత గత గురువారం 50 మంది ఇండియా బ్లాక్ నాయకులకు రాహుల్ విందు ఇచ్చారు. సోమవారం ఖర్గే ఇచ్చిన విందుకు ఇండియా బ్లాక్ మాజీ సభ్యుడైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన సందీప్ పాఠక్, సంజయ్ సింగ్ కూడా హాజరుకావడం విశేషం.


SIRకు వ్యతిరేకంగా మార్చ్..

అంతకుముందు రోజు (ఆగస్టు 10న) SIR‌కి వ్యతిరేకంగా పార్లమెంటు నుంచి 300 మందికి‌పైగా లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన మార్చ్‌కు

రాహుల్, ఖర్గే నాయకత్వం వహించారు. ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నిర్వాచన్ సదన్ వద్ద ఈ మార్చ్‌ను ముగించాలని వారు భావించారు. అయితే ట్రాన్స్‌పోర్ట్ భవన్ సమీపంలో వారిని ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు అడ్డుకోవడంతో గమ్యస్థానానికి చేరుకోలేకపోయారు. తమను ముందుకు వెళ్లనివ్వాలని భద్రతా సిబ్బందితో గంటకు పైగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఖర్గే, రాహుల్ సహా మిగతా ఎంపీలను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ సిబ్బంది బస్సుల్లోకి ఎక్కించి రెండు గంటలకు పైగా తమ అదుపులో ఉంచుకున్నారు. మహిళా ఎంపీలు బారికేడ్లు ఎక్కుతున్న దృశ్యాలు, ప్రియాంక, ఇతర ఎంపీలు రోడ్డుపై బైఠాయించిన దృశ్యాలను మీడియా విస్త్రతంగా కవర్ చేసింది.


బీజేపీ అనుకూల మీడియాను ఆలోచింపజేసిందా?

కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని రాహుల్ ఇచ్చిన ప్రజెంటేషన్‌.. అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా సంస్థలను కూడా ఆలోచింపజేసింది. ప్రతిపక్ష పార్టీలు తమ వ్యక్తిగత విభేదాలు, రాజకీయ అహంకారాలను పక్కన పెట్టి SIRపై కలిసికట్టుగా పోరాడాలన్న భావనను స్ఫురింపజేసింది.


కౌంటర్ ఇవ్వలేని స్థితిలో కేంద్రం?

రాహుల్ ఆరోపణలను అటు కేంద్రం లేదా ఈసీ బలంగా తిప్పికొట్టలేకపోయింది. అయితే కొందరు అధికార పార్టీ నేతలు మాత్రం రాహుల్ ఆరోపణలు అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ ఒకరు మాట్లాడుతూ.."ప్రతిపక్షాలకు SIR ఓ ఆయుధం అవుతుందని ప్రభుత్వం కూడా ఊహించి ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నారు.


వర్షాకాల సమావేశాలు ముందుగానే ముగుస్తాయా?

లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ గురువారం (ఆగస్టు 7) కీలక ఆదాయ పన్ను బిల్లుతో సహా అనేక బిల్లులను కేంద్రం ఎలాంటి చర్చ లేకుండానే ముగించేసింది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 13 నుంచి 17 మధ్య సమావేశాలకు విరామం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21న లేదా అంతకంటే ముందే వర్షాకాల సమావేశాలను ముగించవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. SIR గురించి చర్చించకుండా ఉండేందుకు పార్లమెంటు సమావేశాలను ముందుగానే ముగించే అవకాశం ఉందని ప్రతిపక్షంలోని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

పార్లమెంటులో సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ముగిసినా, లేదా అంతకంటే ముందుగానే ముగిసినా.. SIRకు వ్యతిరేకంగా తమ ప్రచారాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న యోచనలో ఉంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 1న రాహుల్, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్‌తో కలిసి పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగే ర్యాలీలో పాల్గొంటున్నారు.


కాంగ్రెస్ అహంకార ధోరణి వీడిందా?

ఆగస్టు 7న రాహుల్ తన అధికారిక 5వ నంబర్ సునేహ్రీ బాగ్ నివాసంలో ఇచ్చిన విందులా కాకుండా.. ఖర్గే ఇచ్చిన విందు ఉల్లాసంగా ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల రిగ్గింగ్‌పై ప్రసంగాలు లేవు. ప్రెజెంటేషన్‌లు లేవు. నిర్దిష్ట ఎజెండా కూడా లేదు. అయినప్పటికీ ఈ విందు ప్రతిపక్ష ఎంపీలకు చాలా ముఖ్యమైనదని కాంగ్రెస్ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గతంలో భారత కూటమికి దూరంగా ఉన్న పార్టీలను ఈ సమావేశం మళ్లీ దగ్గరకు చేర్చింది. కాంగ్రెస్ హైకమాండ్ అహంకార ధోరణిని వీడిందని ఈ విందు చాటిచెప్పింది.


ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చర్చించారా?

జగదీప్ ధంఖర్ జూలై 21న ఆకస్మికంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఖర్గే, రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా కలిసి ఇచ్చిన ఆతిథ్యం దోహదపడుతుందని కొన్ని వర్గాల సమాచారం. ఖర్చే విందుకు హాజరయిన ఎన్‌సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీకి చెందిన మిసా భారతి, డీఎంకేకు చెందిన కనిమొళి, ఇతర సీనియర్ కూటమి నాయకులు ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చర్చించినట్లు సమాచారం. ఈ విషయంపై తర్వలో అధికారిక సమావేశాన్ని కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News