వంతెన కూలిన ఘటనలో మరో ఇద్దరి మృతి.. మొత్తం మృతులు 13
వడోదరా-ఆణంద్ పట్టణాలను కలిపే ఈ వంతెన నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది.;
గుజరాత్(Gujarat)లోని వడోదర(Vadodara) జిల్లాలో వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. బుధవారం రాత్రి నది నుంచి మరో రెండు మృతదేహాలు వెలికితీశారు. వీరిని మెహ్రామ్ హాథియా (51), విష్ణు రావల్ (27) గా గుర్తించారు.
నాలుగు దశాబ్దాల కాలం నాటి వంతెన..
బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పాద్రా ప్రాంతంలోని మహిసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన రెండు పిల్లర్ల మధ్య స్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఓ ఆటో నదిలో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ అక్కాతమ్ముళ్లు. బాలిక వయసు 4 సంవత్సరాలు కాగా బాలుడి వయసు రెండేళ్లు. ఈ ప్రమాదంలో చిన్నారుల తండ్రి మృతి చెందగా.. తల్లి ప్రాణాలతో బయటపడింది. మరో తొమ్మిది మందిని సహాయక బృందాలు రక్షించాయి.
ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు నదిలో పడిపోయిన తర్వాత ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
సహాయక బృందాలు తొమ్మిది మందిని రక్షించాయని, వీరిలో ఐదుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వడోదర జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహన్ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన చెప్పారు.
వడోదరా-ఆణంద్ పట్టణాలను కలిపే ఈ వంతెన 1985లో నిర్మించినట్లు తెలుస్తోంది. దుర్ఘటనపై ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.