చనిపోయిన వ్యక్తికి డ్యూటీ వేశారు..పాలన ఇలా ఉందంటూ సెటైర్లు..

బీజేపీ పాలిత రాష్ట్రంలో పాలన ఇలా ఉందంటూ ఒడిశా బీజేడీ సోషల్ మీడియా సెల్ హెడ్ స్వయం ప్రకాష్ మహాపాత్ర పెట్టిన పోస్టింగ్ సోషల్ మీడియాలో వైరలయ్యింది.

Update: 2024-09-15 10:51 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ఒడిశాలో పర్యటించనున్నారు. జనతా మైదాన్‌లో మహిళలకు నగదు ప్రోత్సాహక పథకం ‘సుభద్ర యోజన’ను ఆయన ప్రారంభించనున్నారు. మోదీ రాక సందర్భంగా ఏర్పాట్లలో భాగంగా అధికార బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13న ఒక ఉత్తర్వు జారీ చేసింది. రద్దీ నియంత్రణకు సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం నుంచి 50 మంది సీనియర్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (OAS ) అధికారులను కేటాయిస్తూ మహిళా, శిశు అభివృద్ధి విభాగానికి అధికారుల లిస్టు పంపింది. ఆ రోజు విధులు నిర్వహించే అధికారుల పేర్ల జాబితాలో ప్రబోధ కుమార్ రౌత్ పేరు కూడా ఉంది. అయితే ఈయన గతేడాది జూలైలో మరణించారు. చివరగా OCACలో విధులు నిర్వహించారు. డ్యూటీ చేసే వారి లిస్టులో చనిపోయిన వ్యక్తి పేరు ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన చీఫ్ రౌత్ చీఫ్ సెక్రటరీ మనోజ్ అహుజా.. రౌత్ పేరును తొలగించి పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (IDCO)లో ల్యాండ్ ఆఫీసర్ సుబ్రత్ కుమార్ జెనా పేరును చేర్చారు. జరిగిన పొరపాటుపై ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు.

‘చిత్రమైన పాలన..’

ప్రభుత్వ ఉత్తర్వులపై బిజూ జనతాదళ్ (బిజెడి) సోషల్ మీడియా సెల్ హెడ్ స్వయం ప్రకాష్ మహాపాత్ర సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. “చాలా విచిత్రమైన పరిస్థితి. చిత్రమైన పాలన సాగుతోంది. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఏడాది క్రితం మరణించిన ఒక అధికారికి క్రౌడ్ కంట్రోల్ బాధ్యతను అప్పగించారు.”అని ఎక్స్‌లో పోస్ట్‌లో చేశారు. 

Tags:    

Similar News