భారతీయ వస్త్రధారణలో వెళ్లిన జంటను లోపలికి రానివ్వని రెస్టారెంట్..

వీడియో వైరల్ కావడంతో దర్యాప్తునకు ఆదేశించిన ముఖ్యమంత్రి రేఖ గుప్తా..;

Update: 2025-08-09 10:38 GMT

భారతీయ వస్త్రధారణ(Indian attire)లో వెళ్లిన ఓ జంటను ఢిల్లీ(Delhi)లోని పితంపుర ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈనెల 3న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం రేఖా గుప్తా(CM Rekha Gupta) రెస్టారెంట్‌పై చర్య తీసుకోవాలని ఆదేశించారు. 

టీ-షర్టు ధరించిన ఒక వ్యక్తి, కుర్తా-సల్వార్ ధరించిన ఒక మహిళ ఆగస్టు 3న ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌‌కు వెళ్లారు. అక్కడి సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. భారతీయ వస్త్ర ధారణలో వచ్చిన తమను రెస్టారెంట్ సిబ్బంది బయటే నిలబెట్టారని, పైగా రెస్టారెంట్ మేనేజర్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని భార్యభర్తలు ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. వెంటనే దర్యాప్తు చేసి రెస్టారెంట్‌ నిర్వాహకులపై చర్య తీసుకోవాలని ఢిల్లీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రాకు సూచించారు.

రెస్టారెంట్ యజమాన్యంతో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి మాట్లాడారని, దుస్తులపై ఉన్న ఆంక్షలను వారు సడలించారని మంత్రి మిశ్రా ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆ వెంటనే భారతీయ దుస్తుల్లో వచ్చే పౌరులను స్వాగతిస్తామని రెస్టారెంట్ సిబ్బంది బోర్డు పెట్టడం గమనార్హం. కాగా రెస్టారెంట్ యజమాని నీరజ్ అగర్వాల్ ఆరోపణలను ఖండించారు. ముందుగా రిజర్వేషన్ చేసుకోనందునే వారికి ఎంట్రీ దొరికలేదని చెప్పుకొచ్చాడు. 

Tags:    

Similar News