‘దేశాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది’
ఏటా ఎన్నికలతో దేశ ప్రగతి కుంటుపడుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' కార్యక్రమాన్ని అమలుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
దేశం లోపల, వెలుపల ఉన్న కొన్ని శక్తులు భారతదేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని, అయితే వారి కుట్రలు సాగనివ్వమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. 2014 నుంచి సర్దార్ పటేల్ జయంతి అక్టోబర్ 31 న 'రాష్ట్రీయ ఏక్తా దివస్' లేదా జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ.. “ కొన్ని శక్తులు దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. దేశాన్ని కుల ప్రాతిపదికన విభజించడానికి కుట్ర చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన భారతదేశానికి వ్యతిరేకంగా వారి ఆలోచనలు ఉన్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న "అర్బన్ నక్సల్స్" కూటమి పట్ల అప్రమత్తంగా ఉండాలి’’. అని కోరారు.
ఆ రెండింటిని అమలు చేస్తాం..
జమిలి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్ గురించి కూడా మోదీ మాట్లాడారు. ఏటా ఎన్నికలతో దేశ ప్రగతి కుంటుపడుతోందన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకే సెక్యులర్ సివిల్ కోడ్' అమలు దిశగా మన దేశం ముందుకు సాగుతోందన్నారు. దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించామన్నారు. 70 సంవత్సరాలలో మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి రాజ్యాంగంపై ప్రమాణం చేశారని చెప్పారు.