కిష్త్వార్: మేఘవిస్పోటనంలో పెరిగిన మృతుల సంఖ్య..
ఇప్పటిదాకా 60 మంది మృతి - కొనసాగుతున్న సహాయక చర్యలు - ప్రధాని మోదీకి పరిస్థితి వివరించిన జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్..;
జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లోని కిష్త్వార్(Kishtwar)లోని చషోటి ప్రాంతంలో సంభవించిన మేఘవిస్పోటనం (Cloud Burst)లో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో తొలుత 45మంది మరణించారని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ చెప్పారు. ఇప్పటివరకు లభించిన 35 మృతదేహాల్లో 11 మృతదేహాలను గుర్తించామని కిష్త్వార్ జిల్లా ఆసుపత్రి సీఎంవో రాజేంద్ర కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం (ఆగస్టు 15) ప్రధాని మోదీ(PM Modi)కి పరిస్థితిని వివరించారు. మృతుల సంఖ్య 60 కి పెరిగిందని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆయనకు చెప్పారు ఒమర్.
మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం..
గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అబ్దుల్లా (Omar Abdullah) తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో.. కిష్త్వార్ మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. బక్షి స్టేడియంలో ఆయన మాట్లాడుతూ.. "ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న దేశ ప్రజలకు ఇది సంతోషకర రోజు. కానీ అదే సమయంలో మేఘ విస్పోటనం కారణంగా ప్రాణనష్టం జరగడం బాధాకరం. దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారని నాకు సమాచారం అందింది. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. మృతుల కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా,’’ అని పేర్కొన్నారు.