గిరిజన విద్య మెరుగు పడేది ఎప్పుడు?

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్లక్ష్యం నుంచి డ్రాపౌట్ వరకు అన్నీ సమస్యలే. మొత్తంగా 2.05 లక్షల మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. గిరిజన విద్యకు తక్షణ సంస్కరణలు అవసరం.

Update: 2025-10-21 05:40 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విద్యా వ్యవస్థ ఎన్నో సవాళ్లతో సతమతమవుతోంది. ప్రాథమిక స్థాయిలో ఎన్రోల్మెంట్ రేటు 106 శాతానికి పైగా ఉన్నప్పటికీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు 70.9 శాతానికి చేరుకోవడం ఆందోళనకరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు, ఉపాధ్యాయుల కొరత, సాంస్కృతిక, భాషా అడ్డంకులు, ఫండింగ్ అండర్ యుటిలైజేషన్ వంటి సమస్యలు గిరిజన విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి యుడైస్‌ప్లస్ 2024-25 డేటా ప్రకారం, (UDISE+ (Unified District Information System for Education Plus) అనేది భారతదేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థ గురించి సమగ్రమైన డేటాను సేకరించే డిజిటల్ ప్లాట్‌ఫామ్) రాష్ట్రంలో 60,000 మందికి పైగా గిరిజన పిల్లలు మాల్న్యూట్రిషన్ బారిన పడటం విద్యా ప్రగతిని మరింత దెబ్బతీస్తోంది. ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ, అమలు లోపాలు ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

గిరిజనుల కోసం 199 గురుకుల విద్యాలయాలు

గిరిజన విద్యలో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, స్పోర్ట్స్ స్కూలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్సియల్ స్కూల్స్ లో సాధారణ గిరిజనులకు 27 గురుకులాలు ఉన్నాయి. పీవీటీజీ (ప్రిమిటివ్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్)లకు 10 గురుకులాలు, ఒక స్పోర్ట్స్ స్కూలు (అరకు), ఇక జూనియర్ కాలేజీలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్ (కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేవి) 28 ఉన్నాయి. మొత్తంగా 199 గిరిజన గురుకుల విద్యాలయాలు రాష్ట్రంలో ఉన్నాయి.

ఇందులో ఏజెన్సీ ఏరియాలో 53 విద్యాలయాలు ఉండగా ఆ స్కూళ్లలో 20,250 మంది శాంక్షన్ స్ట్రెంత్ కాగా ప్రస్తుతం చదువుతున్న వారు 18,834 మంది ఉన్నారు. వీరిలో బాలురు 10,126 మంది కాగా, బాలికలు 8,708 మంది ఉన్నారు. ఇక ప్లెయిన్ ఏరియా (పట్టణ, గ్రామీణ ప్రాంతాలు) లో 118 విద్యాలయాలు ఉన్నాయి. ఈ స్కూల్స్ లో మొత్తం 25,792 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మొత్తంగా 44,626 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ గురుకులాల్లో చదువుతున్నారు.


విశాఖపట్నం ఏజెన్సీలో గిరిజన పిల్లలకు భోజనం పెడుతున్న ఒక స్వచ్ఛంద సేవా సంస్థ

ఇదే ఏకలవ్య గురుకులాలు ఏజెన్సీలో కో-ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 24 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ లో 7,288 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్లెయిన్ ఏరియాలో నాలుగు గురుకులాలు ఉండగా ఆ గురుకులాల్లో 1,721 మంది చదువుకుంటున్నారు. ఈ గురుకులాల్లో మొత్తం 9,009 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

మొత్తంగా గురుకుల విద్యాలయాల్లో 53,635 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ గురుకులాలను రకరకాలుగా ప్రభుత్వం విభజించింది. ఇందులో సాధారణ గిరిజన గురుకులాలు 28, పీవీటీజీలకు 10, మినీ గురుకులాలు 12, స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గురుకులాలు 4, కాలేజ్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గురుకులాలు 3, గిరిజన సంక్షేమ హాస్టల్స్ ను గురుకులాలుగా మార్చినవి 81, రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీలు 29, అప్ గ్రేడెడ్ జూనియర్ కాలేజీలు 4, ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్ 28 కలిపి 199 గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన తరువాత విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో గిరిజన గురుకుల విద్యాలయ సంస్థలు ఏర్పాటు కాలేదు.

378 ఆశ్రమ స్కూల్స్

ఆశ్రమ స్కూల్స్ ఏపీలోని గిరిజన విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 378 ఉన్నాయి. ఇందులో 3 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం ఉంటుంది. ఈ స్కూల్స్ లో చదువుతో పాటు భోజన వసతి కూడా ఉంటుంది. విద్యార్థులు రాత్రులు స్కూల్స్ లో ఉండాలనుకుంటే ఉండొచ్చు. లేదా ఇండ్లకు వెళ్లి ఉదయం స్కూలుకు రావచ్చు. అయితే దాదాపు వీ70 శాతం స్కూల్స్ కు కాంపౌండ్ గోడలు లేవు. ఎక్కువగా ఈ స్కూల్స్ అడవుల్లోని గిరిజన గూడేల్లోనే ఉన్నాయి. రాత్రుల సమయంలో అడవి జంతువులు స్కూలు ఆవరణలోకి వచ్చి వెళుతున్నాయి. దీంతో విద్యార్థులు భయంతో ఎక్కువ మంది ఇంటికి వెళ్లి ఉదయం స్కూలుకు వస్తున్నారు.

ప్రభుత్వ గిరిజన స్కూల్స్ 1,933

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (ఎక్కువగా సింగిల్ టీచర్ స్కూల్స్) 1933 ఉన్నాయి. ఈ స్కూల్స్ లో 1,2 తరగతుల వరకు మాత్రమే విద్యాబోధన ఉంటుంది. ఈ స్కూల్స్ లో చదువుకుంటున్న వారికి కనీసం అక్షరాలు కూడా రావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంగా రాష్ట్రంలో 2.05 లక్షల గిరిజన విద్యార్థులు వివిధ రకాల స్కూల్స్ లో చదువుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ లో 81 హాస్టళ్లను గురుకుల స్కూల్స్ కిందకు మార్చడం ద్వారా సంక్షేమ హాస్టల్స్ చాలా వరకు తగ్గిపోయాయి. నాణ్యమైన విద్యను అందించడంలో బాగంగా గురుకుల విద్యలో హాస్టల్స్ ను చేర్చారు.


ఆధునిక సమాజాన్ని చూపించే విధానం ఇదేనా: జేవీ రత్నం

గిరిజనులను ఆధునిక సమాజంలోకి తీసుకు రావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని సోషల్ యాక్టివిస్ట్ జేవీ రత్నం అన్నారు. 20 ఏళ్లుగా ఏజెన్సీలోని గిరిజనుల సమస్యలు, ఎన్విరాన్ మెంట్ సమస్యలపై పనిచేస్తున్న జేవీ రత్నం పూర్వపు జర్నలిస్ట్. సముద్ర తీరంలో ఎన్విరాన్ మెంట్ సమస్యలపై ఎప్పటి కప్పుడు అక్కడి వారిని చైతన్య పరిచే పనిలో ఉన్నారు. ‘‘గిరిజనులను అడవుల్లో నుంచి ఆధునిక సమాజంలోకి తీసుకు రావడానికి చదువు ఒక్కటే సరైన మార్గమార్గం’’, చదువుకునే పిల్లలకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అని అన్నారు. ఈ విధమైన చదువులు ఎన్నేళ్లు చెప్పినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.

ఇన్ఫ్రాస్ట్రక్చర్, యాక్సెస్ లోపాలు

గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో ఆశ్రమ పాఠశాలల్లో మంచి త్రాగు నీరు, శుభ్రమైన టాయిలెట్లు, సోలార్ వాటర్ హీటర్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు. ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. ఫలితంగా విద్యార్థులు కలుషిత నీటిని తాగి జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. యూనిఫాంలు, కాస్మెటిక్స్ రెండేళ్లుగా అందకపోవడం, టెక్స్ట్‌బుక్స్ కొరత వంటి సమస్యలు విద్యార్థులు సాధారణ దుస్తులతోనే పాఠశాలకు వెళ్లేలా చేస్తున్నాయి. రాష్ట్రంలో 90 శాతం ఐటీడీఏ పాఠశాలల్లో స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం లేదు. ఇది బాలికల ఎన్రోల్మెంట్‌ను ప్రభావితం చేస్తోంది.

మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల విద్యాలయాన్ని పరిగణలోకి తీసుకుంటే అక్కడ 223 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారని, అందరికీ కలిపి ఒక్కే ఒక్క టాయ్ లెట్ ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రత్యక్ష పర్యటన తరువాత పేర్కొన్నారు. గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇదేనా ప్రాధాన్యత అనే ప్రశ్నలు లేవనెత్తేలా ఉంది.

గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి కురుపాం గురుకుల విద్యాలయాన్ని పరిశీలించారు. ఈ నియోజకవర్గం నుంచి ఆమె గెలిచి గతంలో మంత్రిగా పనిచేశారు. గిరిజన విద్యార్థినుల పట్ల అధికారులు, పాలకులు వ్యవహరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. వైద్య శాల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాగేందుకు మంచినీరు కూడా విద్యార్థులకు అందించలేని పాలన ఒక పాలనేనా అంటూ ధ్వజమెత్తారు.

జియోగ్రాఫికల్ ఐసోలేషన్ మరో పెద్ద సవాలు. రిమోట్ ఏరియాల్లో రవాణా సౌకర్యాలు లేకపోవడం, ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉండటం వల్ల సెకండరీ స్థాయికి చేరుకోలేకపోతున్నారు. యుడైస్‌ప్లస్ 2023-24 డేటా ప్రకారం, ఎలిమెంటరీ నుంచి సెకండరీకి ట్రాన్సిషన్‌లో 18 శాతం గ్యాప్ ఉంది. ఇది గిరిజన పిల్లల్లో మరింత ఎక్కువ.

ఉపాధ్యాయుల కొరత, సాంస్కృతిక అడ్డంకులు

గిరిజన గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని మదనపల్లె గురుకులంలో ప్రిన్సిపల్ మినహా మిగిలినవారంతా తాత్కాలిక సిబ్బంది. 13 పోస్టులకు 7 మందిని తక్కువ జీతంతో నియమించారు. (ఇటీవల డీఎస్సీకి ముందు, ఈనెల 22 తరువాత కొత్త ఉపాధ్యాయులు బాధ్యతలు తీసుకుంటారు) ఉపాధ్యాయులకు స్థానిక భాషలు, సంస్కృతి తెలియకపోవడం వల్ల విద్యార్థులతో కనెక్ట్ కాలేకపోతున్నారు. కరికులమ్‌లో గిరిజన సంస్కృతి, భాషలు లేకపోవడం విద్యార్థుల్లో అనాసక్తిని కలిగిస్తోంది.

జెండర్ అసమానతలు మరో సమస్య. గిరిజన బాలికల లిటరసీ రేటు 49.35 శాతం. జాతీయ సగటు 64.64 శాతం కంటే తక్కువ. పేదరికం, చైల్డ్ లేబర్ వల్ల డ్రాపౌట్ ఎక్కువ.

ఆరోగ్య, పోషణ సమస్యలు విద్యకు అడ్డు

రాష్ట్రంలో 60,000 మందికి పైగా గిరిజన పిల్లలు స్టంటింగ్ (33,143), వేస్టింగ్ (10,039), అండర్‌వెయిట్ (18,620) సమస్యలతో బాధపడుతున్నారు. ఇది విద్యా ప్రగతిని దెబ్బతీస్తోంది. ఎందుకంటే మాల్న్యూట్రిషన్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌ను ప్రభావితం చేస్తుంది. ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పాటించకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి.

ఫండింగ్, పాలసీ గ్యాప్స్

ట్రైబల్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పెండిచర్‌లో అండర్ యుటిలైజేషన్ చాలా ఎక్కువ. ట్రైబల్ సబ్ ప్లాన్‌లో 63 శాతం పెరిగినప్పటికీ, కొన్ని స్కీమ్స్‌లో ఎక్స్‌పెండిచర్ 0-23 శాతం మాత్రమే. పరిపాలనా నిర్లక్ష్యం, అవేర్‌నెస్ లేకపోవడం మూల కారణాలు. ప్రభుత్వ పథకాలు (Rs. 374.97 లక్షలు), విద్యా దీవెన (Rs. 7.69 కోట్లు), వసతి దీవెన ఉన్నప్పటికీ, అమలు లోపాలు ఉన్నాయి. డిజిటల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ మీల్స్ వంటివి సానుకూలం. కానీ రిమోట్ ఏరియాల్లో రీచ్ లేదు.

సమగ్ర సంస్కరణల అవసరం

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విద్యా వ్యవస్థ రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణాల్లో లోపాలతో సతమతమవుతోంది. రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య ఆరోపణలు ఉన్నప్పటికీ, నిర్లక్ష్యం కారణంగా సమస్యలు పెరిగాయి. ఆర్థికంగా ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి Rs. 14,925 కోట్లు కేటాయించినప్పటికీ, గ్రౌండ్ లెవల్ అమలు లేదు. సామాజికంగా పేదరికం, మాల్న్యూట్రిషన్ వంటివి విద్యను అడ్డుకుంటున్నాయి.

మదర్ టంగ్ ఇన్‌స్ట్రక్షన్, కల్చరల్ సెన్సిటివ్ కరికులమ్, టీచర్ ట్రైనింగ్, కమ్యూనిటీ ఇన్‌వాల్వ్‌మెంట్ అవసరం. ప్రభుత్వం వెంటనే మానిటరింగ్ సిస్టమ్స్, రెగ్యులర్ ఆడిట్స్ చేపట్టకపోతే, గిరిజన సమాజం మరింత వెనుకబడుతుంది.

గిరిజన విద్యార్థుల సమస్యలు గుర్తించడంలో ప్రభుత్వం ఫెయిల్ : ఎన్‌ఎస్‌యుఐ

ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి జె మల్లికార్జున మాట్లాడుతూ కలుషిత ఆహార సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసారు. సమస్యలను గుర్తించడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. "ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి." అని డిమాండ్ చేశారు. గిరిజనులు చాలా మంది అమాయకులు, వారిని మంచి మనసుతో ఆదువాలి అని అన్నారు.

గిరిజన బిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టదా: ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి మాట్లాడుతూ గిరిజన గురుకులాల్లో ఆహార నాణ్యతను ప్రశ్నించారు. గురుకులాలు అంటే ఎంతో బాగుంటాయని బయటి వారు అనుకుంటారు. కానీ ప్రభుత్వం సాధారణ స్కూళ్లకంటే హీనంగా గురుకులాలను తయారు చేసింది అని విమర్శించారు. "గిరిజన బిడ్డల ప్రాణాలకు బాధ్యత ఎవరిది?" అని ప్రశ్నించారు.

Tags:    

Similar News