బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడలను కబ్జా చేస్తుంది: కేజ్రీవాల్
"బీజేపీ వాళ్లకు ముందు మీ ఓట్లు కావాలి.. ఎన్నికల తర్వాత మీ భూమి కావాలి," - అరవింద్ కేజ్రీవాల్;
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీ(BJP)పై విరుచుకుపడుతున్నారు. ఒకవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూనే.. కాషాయ పార్టీ పవర్‌లోకి వస్తే ఏం కోల్పోతారోనని ఢిల్లీ వాసులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపేలా ఉన్నాయి. బీజేపీ అధికార పగ్గాలు చేపడితే.. ఢిల్లీలోని స్లమ్ (slums) ఏరియాలను ఆక్రమించేస్తుందని ఆరోపించారు. ఢిల్లీలోని శాకూర్ బస్తీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
"వారికి ముందుగా మీ ఓట్లు కావాలి.. ఎన్నికల తర్వాత మీ భూమి కావాలి," అని కేజ్రీవాల్ బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు.
కాషాయ పార్టీ ప్రతిపాదించిన 'జహాన్ ఝుగ్గీ వహాన్ మకాన్' పథకంపై కూడా కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. దానిని కేవలం చూపుడు దండగా ఆయన అభివర్ణించారు. "గత ఐదేళ్లలో వారు పేదల కోసం కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించారు," అని చెప్పారు.
సమావేశంలో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్ (Satyendar Jain) కూడా ఉన్నారు. ఈయన శాకూర్ బస్తీ నియోజకవర్గం నుంచి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. 2013, 2015, 2020లో గెలిచారు. ఇప్పుడు మరోసారి పోటీచేస్తున్నారు.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటిస్తారు.